
200 సైలెన్సర్ల ధ్వంసం
ఖలీల్‌వాడి: వాహన సైలెన్సర్లు మార్చి శబ్ధ కాలుష్యానికి కారకులవుతున్న యువకులపై నగర పోలీసులు కొరడా ఝలిపించారు. వాహనాల తయారీ కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ కాకుండా మాడిఫైడ్ సెలెన్సర్లను అమర్చుకుని కొందరు నగరంలో తిరుగుతున్నారు. ఆయా వాహనాలు రోడ్లపై వెళ్తుంటే భారీ శబ్ధం వెలువడుతుంది. దీంతో గుండెజబ్బులు ఉన్నవారు, చిన్నారులు, వృద్ధులు ఆందోళనకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో నగర పోలీసులు ఇటీవల స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 200 వాహనాలకు ఉన్న మాడిఫైడ్ సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటన్నింటినీ శుక్రవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ట్రాఫిక్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. వాహనదారులకు జరిమానాలు విధించి వాటిని రోడ్డు రోలర్‌తో తొక్కించినట్లు ఏసీపీ తెలిపారు. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తప్పవన్నారు. మైనర్లకు తల్లి దండ్రులు వాహనాలను ఇవ్వొద్దని అన్నారు. శబ్ధ కాలుష్యం ఏర్పడితే జరిమానా, జైలు శిక్ష విధిస్తామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐలు ప్రసాద్, శేఖర్, ఎస్సై సుమన్, రహిమాతుల్లా సిబ్బంది ఉన్నారు.