
ఏకచక్రేశ్వరుడి సన్నిధిలో గజ్జె పూజ
బోధన్: బోధన్ ఏకచక్రేశ్వరాలయంలో శుక్రవారం రాత్రి శ్రీ నాట్యతరంగిణి కూచిపూడి నృత్యాలయం విద్యార్థుల తొలి గజ్జె పూజ వేడుకలు ఆద్యంతం వైభవంగా సాగాయి. నృత్యాలయం వ్యవస్థాపకులు, నాట్యచార్యులు కర్ణం శ్రీనివాస్, సతీమణి కర్ణం తిరముల నేతృత్వంలో కూచిపూడి నాట్యం నేర్చుకునే శిష్యుల గజ్జె పూజ వేడుకను శాసీ్త్రయబద్ధంగా నిర్వహించారు. 13 మంది బాలికలు ఏకచక్రేశ్వరుడి సన్నిధిలో గజ్జెలు ధరించి తొలి అడుగులు వేశారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ శ్రీ జ్ఞాన సరస్వతీ సంగీత కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ టీ స్వప్నరాణి మధురమైన గాత్రం, విశ్వనాథ్ మాస్టర్ మృదంగ వాద్యం మధ్య గజ్జెలు ధరించిన బాలికలు నృత్య ప్రదర్శనతో విశేషంగా ఆకట్టుకున్నారు.ఆలయ కమిటీ చైర్మన్ హరికాంత్ చారి, ప్రముఖ యోగా మాస్టర్ మాధవీలత, పట్టణ ప్రముఖులు గజ్జె పూజ వేడుకను తిలకించారు.