
అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
ఎడపల్లి(బోధన్): పేదల సొంతింటి కళ నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అధికారుల నిర్లక్ష్యంతో అభాసుపాలవుతోంది. ఆదర్శంగా ఉండాల్సిన పైలట్ గ్రామంలోనే నిబంధనలకు విరుద్ధంగా అనర్హులకు ఇళ్లు కేటాయించడం విస్మయానికి గురిచేస్తోంది. అందుకు నిదర్శనమే జిల్లాలోని ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామం. ఈ గ్రామంలో 128 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, అందులో 50 శాతం అనర్హులే కావడం విశేషం.
లిస్టు బయటపెట్టిన గ్రామస్తులు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీలు తయారు చేసిన జాబితాను తహసీల్దార్, ఎంపీడీవో, ఇంజినీర్లతో కూడిన మండల స్థాయి బృందం క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంది. కానీ, అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకులు సూచించిన వారి పేర్లతో జాబితాను తయారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో నిరుపేదలకు దక్కాల్సిన ఇళ్లు.. అనర్హులకు మంజూరయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు లబ్ధిదారుల జాబితాను జీపీ నోటీసు బోర్డులో ప్రదర్శించాలని గ్రామ కార్యదర్శితోపాటు ఎంపీడీవోను కో రగా, జాబితాను బహిర్గతం చేయడం కుదరదని తే ల్చిచెప్పినట్లు తెలిసింది. దీంతో గ్రామస్తులు జిల్లాస్థాయి అధికారి ద్వారా జాబితాను సేకరించగా అస లు విషయం బయటపడింది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ఐడీ నంబర్ 209875/ 2713888, 2082560 గల వ్యక్తులు జైతాపూర్ వాసులు కాకపోయి నా ఇళ్లు మంజూరు చేశారు. ఐడీ నంబర్ 5012883, 4787 506, 1911135, 1906291, 5606656, 10525 70, 2993051, 3305306, 1202490, 1183243 గల ఐదు కుటుంబాల్లో అత్తాకోడళ్ల పేర్లు జాబితాలో ఉన్నాయి. ఐడీ నంబర్ 1548319, 3709213లో ఓ వ్యక్తికున్న ఇద్దరు భార్యల పేరిట ఇళ్లు మంజూరయ్యాయి. ఐడీ నంబర్ 200168, 3723934 గల వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులు. వీరి భార్యల పేరిట కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి.
ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతరు
అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలంటూ స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలనూ అధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది. పథకం పక్కదారి పట్టకుండా చూడాల్సిన ఇందిరమ్మ కమిటీలు చోద్యం చూస్తున్నాయి. ఎమ్మెల్యే ఆదేశాలతో ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన విషయం అధికారుల దృష్టికి వచ్చినా స్పందన కరువైంది.
అధికారుల నిర్లక్ష్యంతో అనర్హులకు
ఇందిరమ్మ ఇళ్లు
పైలట్ గ్రామంలో
50శాతం అనర్హులు..
లబ్ధిదారుల జాబితాలో
ప్రభుత్వ ఉద్యోగులు
వాస్తవాలు బయటపెట్టిన గ్రామస్తులు
కలెక్టర్‌కు నివేదిస్తాం..
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో కొందరికి ఒకే కుటుంబంలో రెండు ఇళ్లు మంజూరైన విషయం వాస్తవమే. విచారణ చేపట్టి వాటిని తొలగించడానికి కలెక్టర్‌కు నివేదిస్తాం. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ఆర్టీసీ ఉద్యోగి పేరు ఇప్పటికే తొలగించాం. ఇంకా అనర్హులుంటే విచారణ జరిపి వారి పేర్లనూ తొలగిస్తాం.
– నగేశ్, పంచాయతీ కార్యదర్శి, జైతాపూర్