
అనుభవాలు పంచుకొని..
సలహాలు స్వీకరించి
డొంకేశ్వర్(ఆర్మూర్): వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మూడు రోజులపాటు జరిగిన రైతు మహోత్సవం వేడుక విజయవంతంగా ముగిసింది. చివరి రోజు బుధవారం నిజామాబాద్‌తోపాటు కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పండుగ వాతావరణం కనిపించింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన 130కు పైగా స్టాల్స్ కిటకిటలాడాయి. రైతులు, వారు పండించిన ఉత్పత్తులతోపాటు వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తులు, ఆధునిక సాగు పరికరాలు, అధిక దిగుబడులను అందించే వంగడాలు, మేలు జాతి పాడి పశువులు తదితర వాటిని స్టాళ్లలో ప్రదర్శించగా, రైతులు ఆసక్తిగా తిలకించారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య శాఖ శాస్త్రవేత్తలు, నిపుణులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన యూనివర్సిటీ, ఇతర వ్యవసాయ పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు మూడు రోజులపాటు కొనసాగిన వర్క్‌షాపులో ఆయా అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ఏ జానయ్య, వివిధ విభాగాల అధిపతులు శ్రీలత, అంజయ్య, చంద్రశేఖర్, ప్రవీ ణ్, శివకృష్ణ, శాస్త్రవేత్తలు రాజ్ కుమార్, శ్వేత, రాజశేఖర్, విజయ్, స్వప్న తదితరులు పంటల సాగులో పాటించాల్సిన మెళకువలు, సస్యరక్షణ చర్యలు, ఆధునిక వ్యవసాయం, భూసారం పెంపుదల, అధిక దిగుబడులను అందించే వంగడాలు, తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలను సాధించేందుకు అవలంబించాల్సిన పద్ధతులు, వాణిజ్య పంటల ఎంపికకు పరిశీలించాల్సిన అంశాలపై సెషన్ల వారీగా రైతులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పురస్కారాలు అందుకున్న అభ్యుదయ రైతులతోపాటు రైతు ఉత్పాదక సంస్థల ప్రతినిధులు సైతం రైతు మహోత్సవం వేదిక ద్వారా తమ అనుభవాలు పంచుకున్నారు.
స్టాళ్లను సందర్శించిన కలెక్టర్, కార్పొరేషన్ల చైర్మన్లు
ముగిసిన రైతు మహోత్సవం
ఉత్సాహంగా పాల్గొన్న అన్నదాతలు.. కిటకిటలాడిన స్టాళ్లు
ఆధునిక సాగుపై సలహాలు, సూచనలు అందించిన శాస్త్రవేత్తలు, నిపుణులు
నూతన పద్ధతులపై అనుభవాలను
పంచుకున్న ఆదర్శ రైతులు
ముగింపు సందర్భంగా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుతోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీసీసీబీ చైర్మన్ రమేశ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి తదితరులు స్టాళ్లను సందర్శించారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన నిజామాబాద్ జిల్లాలో రైతు మహోత్సవ వేడుక నిర్వహించడంతో స్థానిక రైతులతోపాటు జిల్లాకు ఆనుకొని ఉన్న కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల రైతులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూర్చిందని కలెక్టర్ అన్నారు. ఇక్కడ పరిశీలించిన అంశాలు, నూతన సాగు విధానాలను రైతులు గ్రామాలలోని సహచర రైతులకు తెలియజేస్తూ వారిని కూడా అధిక దిగుబడుల సాధన దిశగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్ రావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

అనుభవాలు పంచుకొని..

అనుభవాలు పంచుకొని..