సిరికొండ / ఇందల్వాయి: ధరణి స్థానంలో రాష్ట్ర ప్ర భుత్వం కొత్తగా తెచ్చిన భూ భారతి చట్టంతో రైతులకు మేలు చేకూరుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. నూతన ఆర్‌వోఆర్ చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. సిరికొండ, ఇందల్వాయి మండలా ల్లోని రైతు వేదికలో శుక్రవారం నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సుల్లో అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు భూ హక్కులపై ఎలాంటి సమస్యలు రాకుండా భూ భారతి చట్టంలో అనేక అంశాలు పొందుపర్చినట్లు తెలిపారు. పైలట్ గ్రామాల్లో అమలు తర్వాత జిల్లాలోని ఒక మండలంలో ప్రయోగాత్మకంగా భూ భారతిని అమలు చేసి రైతుల నుంచి సూచనలు స్వీకరించి రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు. ప్రతీ రైతుకు భూధార్ కార్డులు అందుతాయన్నారు. ధరణితో ఎదురైన సమస్యకు భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. చట్టంలోని అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, ఇన్‌చార్జి ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్ వెంకట్ రావు, పీఏసీఎస్ చైర్మన్లు గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి , గంగాధర్, ఏఎంసీ డైరెక్టర్ ముత్తెన్న, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు