
వేర్వేరు కారణాలతో పలువురి ఆత్మహత్య
కామారెడ్డి క్రైం: వేధింపులకు మరో నిండు ప్రాణం బలైంది. తరచూ భర్త వేధించడంతో ఓ వివాహిత భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలానికి చెందిన పసుపులేటి సాయి అనే వ్యక్తికి అదే మండలానికి చెందిన పూజిత(20)తో తొమ్మిది నెలల క్రితం వివాహం జరిగింది. కొంత కాలంగా సాయి కామారెడ్డి సమీపం లోని ఎంఎస్‌ఎన్ ఫార్మా కంపనీలో ఉద్యోగం చేస్తూ తన భార్యతో కలిసి అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కొద్ది రోజులుగా సాయి మరో మహిళతో నిత్యం ఫోన్‌లో మాట్లాడుతున్నాడనే విషయంలో భార్యా భర్తల మధ్య గొడవ జరుగుతోంది. దీంతో పాటు పెళ్లి సమయంలో ఒప్పుకున్న అర ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేయించాలని సాయి తన భార్యతో తరచూ గొడవపడుతూ వేధింపులకు గురి చేసేవాడు. బుధవారం రాత్రి కూడా వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లు కుటుంబీకులు తెలిపారు. దీంతో భర్త వేధింపులు తాళలేక మనస్థాపానికి గురైన పూజిత గురువారం ఉదయం వారు నివాసం ఉంటున్న రెండు అంతస్తుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పట్టణ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. భర్త వేధింపులతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి కృష్ణారావు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
జీవితంపై విరక్తితో ఒకరు..
రుద్రూర్: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సునీల్ గురువారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. కోటగిరి పీఎస్ పరిధిలోని పొతంగల్ మండలం సోంపూర్ గ్రామానికి చెందిన సీతాపులే సంజీవ్(42) మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంపై విరక్తితో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
కుమార్తె కాపురంలో కలహాలు రావడంతో..
మోర్తాడ్: కుమార్తె కాపురంలో కలతలు రావడంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మోర్తాడ్‌లో చేసుకుంది. ఎస్సై విక్రమ్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. మోర్తాడ్‌కు చెందిన కట్టెకోల్ల గోపి(51) వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని కుమార్తె ప్రేమ వివాహం చేసుకోగా ఆమె కాపురంలో సమస్యలు తలెత్తాయి. దీంతో తండ్రి వద్ద ఉంటోంది. మరోవైపు కాలికి ఏర్పడిన గాయం మధుమేహం వ్యాధితో తగ్గకపోవడంతో జీవితంపై విరక్తితో గోపి బుధవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
ఆర్మూర్‌లో మరొకరు..
ఆర్మూర్‌టౌన్: పెర్కిట్‌కు చెందిన సయ్యద్ జాఫర్(42) అనే వ్యక్తి జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ గురువారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. జాఫర్ కొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంపై విరక్తితో బుధవారం రాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

వేర్వేరు కారణాలతో పలువురి ఆత్మహత్య

వేర్వేరు కారణాలతో పలువురి ఆత్మహత్య