
లండన్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యం లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక కోవిడ్ నిబంధనల వలన ఈ ఏడాది నిరాడంబరంగా బతుకమ్మ ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా టాక్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ,‘ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్ఫూర్తి తో బతుకమ్మను విశ్వవ్యాప్తం చెయ్యాలనే ఆలోచనతో టాక్ ఆధ్వర్యంలో మహిళలు చారిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జి వద్ద బతుకమ్మ ఆట, పాటలు ఆడి బతుకమ్మకు అరుదైన గౌరవాన్నిచ్చారు.
ప్రతీ సంవత్సరం వందల మంది ఆడబిడ్డలతో ఎంతో ఆనందంతో బతుకమ్మ వేడుకల్ని జరుపుకుంటాం. ఇది సంబరాలకు సమయం కాకపోయినా మన సంస్కృతి సంప్రదాయాల్ని మరువకుండా స్థానిక కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వినూత్నంగా చారిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జి వద్ద బతుకమ్మ ఆట చూడడం చాలా గర్వంగా ఉంది. వాతావరణం అనుకూలంగా లేకపోయినా బతుకమ్మ పేర్చి ఆడి, పాడి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్న టాక్ ఆడబిడ్డలకు కృతజ్ఞతలు.
స్థానిక కోవిడ్ నిబంధనల వల్ల టాక్ కార్యవర్గ సభ్యులంతా వివిధ గ్రూప్‌లుగా ఏర్పడి ఆరుగురికి మించకుండా బతుకమ్మ వేడుకల్ని జరుపుకున్నాం. కొంత మంది ఇంటికే పరిమితమై బతుకమ్మ పండగ జరుపుకున్నారు’ అని అన్నారు. అదేవిధంగా టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ, మన సంస్కృతిని మరిచి పోకుండా ఎలాంటి పరిస్థితులున్న ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ ఆడిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు కృతజ్ఞతాభినందనాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment