
మస్కట్: డా॥ డి. రామానాయుడు 86వ జయంతి సందర్భంగా వంశీ గ్లోబల్ అవార్డ్స్, ఇండియా, సంతోషం ఫిలిమ్ న్యూస్, తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో సంయుక్తంగా అంతర్జాల వేదికగా మస్కట్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులతో పాటు ఐదు ఖండాలలోని ఇతర ప్రముఖులు ఆయనకు ఘననివాళి అర్పించారు. నిర్మాత అనే పదానికి అసలు సిసలైన చిరునామా డా॥ డి. రామానాయుడు అని వక్తలు కొనియాడారు. ఆయన కుమారుడు, సినీ నిర్మాత డి. సురేష్‌బాబు మాట్లాడుతూ.. ‘నాన్న చాలా సినిమాలు తీశారు. ఆయన ఎప్పుడూ విలువలతో కూడిన చిత్రాలే నిర్మించారు. పరిశ్రమకు ఏదైనా అవసరమైతే నాన్న ఎలాగైతే స్పందించారో అదే స్ఫూర్తితో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటాన’ని అన్నారు.
నటుడు, నిర్మాత, మాజీ పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ..‘సినిమా అనేది అద్భుతమైన మాధ్యమం. సినిమా నిర్మాత అవ్వాలంటే అన్ని విభాగాల మీద పూర్తి అవగాహన ఉండాలని చెప్పిన వ్యక్తి రామానాయుడుగారు’ అని కొనియాడారు. డా॥ వంశీ రామరాజు మాట్లాడుతూ..‘ప్రేమించు’ చిత్రం జయప్రదమైన సందర్భంలో దివ్యాంగుల ఆశ్రమాలకు చేయూతనిచ్చిన మానవతామూర్తి రామానాయుడుగారు’ అన్నారు. తెలుగు కళాసమితి ఓమాన్ కన్వీనర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. ‘ఓడిపోతామనే ఆలోచనలో ఉన్నవారు రామానాయుడు జీవితాన్ని తెరచి చూస్తే ఆయనను ఆదర్శంగా తీసుకొని వారి బాటలో పయనిస్తార’ని అన్నారు.
కార్యక్రమాన్ని ప్రముఖ అంతర్జాతీయ గాయని శివశంకరి గీతాంజలి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సురేష్ కొండేటి, మండలి బుద్ధప్రసాద్, దర్శకుడు బి. గోపాల్, మాధవపెద్ది సురేష్, బలభద్రపాత్రుని రమణి, భువనచంద్ర, చంద్రబోస్, కాశీ విశ్వనాథ్, వి.ఎన్. ఆదిత్య, రామకృష్ణ గౌడ్, రవి కొండబోలు, ముప్పలనేని శివ, ఉపేంద్ర చివుకుల, డా॥ ఎల్లాప్రగడ రామకృష్ణారావు, రత్నకుమార్ కవుటూరు, చింతగుంట ఉదయపద్మ, డా॥ బూరుగుపల్లి వ్యాసకృష్ణ, లలితా రామ్, హరివేణుగోపాల్, రాజేష్ తోలేటి, సరోజా కొమరవోలు, శ్రీదేవి జాగర్లమూడి, సుబ్బు వి. పాలపర్తి, చింతలపూడి త్రినాథరావు, లయన్ ఎ. విజయకుమార్, చైతన్య సూరపనేని, దైవజ్ఞ శర్మ, శ్రీవాణి, రేలంగి నరసింహారావు పాల్గొని ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment