రియాద్: సౌదీ అరేబియాలోని హజ్ యాత్ర ఈసారి విషాదాంతంగా మారుతోంది. మునుపెన్నడూ లేనంతగా ఉష్ణోగ్రత నమోదు కావడం.. దీనికి తోడు ఇతరత్ర సమస్యలతో యాత్రికులు చనిపోయారు. ఆ మృతుల సంఖ్య 600పైనే ఉందని సౌదీ హజ్ నిర్వాహకులు తాజాగా ప్రకటించారు. ఇందులో 50కి పైగా భారతీయులు ఉన్నట్లు సమాచారం.
ఈసారి దాదాపు 600 మందికి పైగా యాత్రికులు మరణించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో అనేక దేశాలకు చెందినవారు ఉన్నారు. ఈజిప్టుకు చెందినవారే 300కు పైగా ఉన్నట్లు అంచనా. హజ్ యాత్రలో మరణించిన భారతీయుల సంఖ్య 68గా ఉందని సౌదీ దౌత్య విభాగం ప్రకటించింది.‘‘మరణించిన వాళ్లలో 68 మంది భారతీయులు ఉన్నారు. వీళ్లలో కొందరు సహజంగా.. వృద్ధాప్యరిత్యా సమస్యలతో మరణించారు. మరికొందరు ప్రతికూల వాతావరణంగా చనిపోయారు. తప్పి పోయినవాళ్ల వివరాలు తెలియాల్సి ఉంది’’ అని ప్రకటించింది.
ఇక ఎడారి నగరమైన మక్కాలో ఉష్ణోగ్రతలు తారా స్దాయికి చేరుతున్నాయి. సౌదీ ప్రభుత్వం ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా.. తీవ్ర ఎండలు, ఉక్కబోత వాతావరణమే అందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. హజ్ యాత్ర చేసే వారిలో వృద్ధులు, మధ్య వయస్సు వారు ఎక్కువ మంది ఉంటుంటారు. వీరంతా ఎండ ధాటికి తట్టుకోలేక చనిపోతున్నారు. అయితే ఇది ప్రతీ ఏడాది సర్వసాధారణంగానే జరుగుతుందని.. ఈ ఏడాది అది మరింత ఎక్కువ ఉందని చెప్పలేమని ఓ దౌత్యాధికారి అంటున్నారు.
ఏటా బక్రీద్ మాసంలో జరిగే ఈ యాత్రకు వివిధ దేశాల నుంచి లక్షల సంఖ్యలో యాత్రికులు తరలివస్తుంటారు. ఈసారి యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్ నిర్వాహకులు వెల్లడించారు. భారత్ నుంచి కూడా ప్రతీ ఏటా భారీ సంఖ్యలో హజ్ యాత్రకు వెళ్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment