సాక్షి, హైదరాబాద్: గ్రామీణాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో వెనుకబడిన గ్రామాలను గుర్తించి అక్కడి ప్రజలకు మౌలిక వసతులను కల్పించేందుకు ప్రవాస తెలంగాణ వాసులు ముందుకు రావాలని కోరారు. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో ఆరవ తెలంగాణ ప్రవాసి దివస్ (2021) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి కొనసాగిస్తామని టీడీఎఫ్ చెప్పిందని, ఈ మేరకు తెలంగాణలో ఉపాధి అవకాశాల కల్పనకు చొరవ తీసుకోవాలని కోరారు. దేశంలో తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేస్తోందని చెప్పారు. 130 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేశామని, ఇతర దేశాలకు కూడా త్వరలోనే టీకాలు అందజేస్తామని తెలిపారు.
ఇదే సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ‘90 శాతం తెలంగాణ బిడ్డలతో పాటు వివిధ పార్టీల్లో ఉన్న వారు కూడా రాష్ట్రం కోసం పోరాటం చేశారు. ఎన్నారైలు రాష్ట్రంలోని గ్రామాలను అభివృద్ధి చేయాలి. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టిసారించాలి, పేద విద్యార్థులను ఆదుకుని వారిని చదివించాలి..’ అని కోరారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా టీడీఎఫ్ పనిచేయాలని కోరారు. తెలంగాణ టూరిజం అభివృద్ధిలోనూ ఎన్నారైలు భాగస్వామ్యం కావాలని కోరారు. తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment