అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వాలనే డిమాండ్‌తో శంకర నేత్రాలయ (యూఎస్‌ఏ) అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యములో వరుసగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటివరకు 80 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా యూఎస్‌ఏ నుంచి నుండి నీలిమ గడ్డమణుగు వ్యాఖ్యాతగా 24 ఏప్రిల్ 2022 నాడు జరిగిన అంతర్జాల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆపి (AAPI) పూర్వ అధ్యక్షులు డాక్టర్ సురేష్ రెడ్డి ముఖ్య అతిథిగా, చెన్నై నుంచి ఘంటసాల కోడలు శ్రీమతి కృష్ణ కుమారి ఘంటసాల అతిధులుగా పాల్గొన్నారు.
సురేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర పాలకులు మొదటి నుంచి దక్షిణాది వారి మీద చిన్నచూపుతో వ్యవహరించారని, ముఖ్యంగా తెలుగు వారికీ అన్ని విధాలుగా అన్యాయం జరిగిందన్నారు. ఘంటసాల గారికి భారతరత్న విషయంలో అదే జరిగిందన్నారు. ఇప్పటికయినా ఘంటసాలకి భారతరత్న వచ్చేంతవరకు అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (IAMA) సంస్థలో ఉన్న తెలుగు డాక్టర్లందరి సహకారంతో భారతరత్న కోసం ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తూ ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతుని ప్రకటించారు.
కృష్ణ కుమారి ఘంటసాల మాట్లాడుతూ నిర్వాహుకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఘంటసాల కుటుంబం తరుపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు. మనందరి ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు, ఈ సందర్భంగా బాల ఇందుర్తిని ప్రత్యేకంగా అభినందించారు. అతిత్వరలోనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలసి వారి సహకారంతో మన అందరి ప్రయత్నాలను ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని అభ్యర్ధించారు.
ఆస్ట్రేలియా, సిడ్నీ నుండి సంగీత దర్శకుడు, తబలా ప్లేయర్ ఆదిశేషు కోట, సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు, డెన్మార్క్ నుండి తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకుడు అమర్నాధ్ పొట్లూరి, ఉగాండా నుండి తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఉగాండా చైర్మన్ వి.పార్థసారథి, సౌదీ అరేబియా నుండి సౌదీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు దీపికా రవి, UK నుండి తెలుగు అసోసియేషన్ ఆఫ్ సట్టన్ (TAS) అధ్యక్షుడు నవీన్ జలగడుగు, హంగేరి నుండి యోగహిత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, అరవింద కొల్లిపార, యు.యెస్.ఏ నుండి శంకర్ నేత్రాలయ బోర్డు సభ్యులు, ఉపేంద్ర రాచుపల్లి తదితరులు పాల్గొని ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు, ఘంటసాల కి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం, ఇది తెలుగు వారి ఆత్మ గౌరవం అని అభిప్రాయపడుతూ, ఘంటసాల కి కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డు తో సత్కరించాలి అని అభ్యర్ధించారు, అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.
ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 83 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని, ఈ టీవీ చర్చా కార్యక్రమాలకు ప్రపంచ దేశాలలోని తెలుగు సంఘాలకి అనుసంధాన కర్తగా సింగపూర్ నుండి రత్న కుమార్ కవుటూరు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కావలసిన సహకారాన్ని శ్రీమతి కృష్ణ కుమారి ఘంటసాల అందిస్తున్నారు. ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు అనూహ్యస్పందన లభిస్తోందని నిర్వాహుకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment