సాక్షి, ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత అత్యన్నుత పురస్కారం భారతరత్నను మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానికి(96) ఇవ్వనున్నారు. భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో అద్వానీని గౌరవించింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్బంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ.. ఎల్‌కే అద్వానీ జీకి భారతరత్న ఇస్తున్నారనే వార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఆయనతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించాను. ఎల్‌కే అద్వానీ రాజనీతిజ్ఞుడు. భారతదేశ అభివృద్ధిలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. చాలా కింది స్థాయి నుంచి ఉప ప్రధాని వరకు ఎదిగారు. అనేక కేంద్ర మంత్రి పదవులు నిర్వహించారు. పార్లమెంట్‌లో ఆయనకు ఎంతో అనుభవం ఉంది. ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎప్పుడూ ఆదర్శప్రాయమైనవి, గొప్ప అంతర్దృష్టులతో నిండి ఉన్నాయి అని కొనియాడారు.
Advani Ji’s decades-long service in public life has been marked by an unwavering commitment to transparency and integrity, setting an exemplary standard in political ethics. He has made unparalleled efforts towards furthering national unity and cultural resurgence. The conferring…
— Narendra Modi (@narendramodi) February 3, 2024
ఎల్‌కే అద్వానీ పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. ఆయన 1927 నవంబర్ ఎనిమిదో తేదీన ప్రస్తుత పాకిస్తాన్(భారత్ విభజన కాకముందు)లోని కరాచీలో జన్మించారు. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. అలాగే పాక్‌లోని హైదరాబాద్‌లో డీజీ నేషనల్ కాలేజీలో న్యాయవిద్యను చదివారు. ఇక, 1947లో ఆర్‌ఎస్‌ఎస్ కరాచీ విభాగం కార్యదర్శిగా అద్వానీ విధులు నిర్వర్తించారు. బీజేపీ వ్యవస్థాపకుల్లో అద్వానీ కూడా ఒకరు.
దేశ విభజన తర్వాత 1947 సెప్టెంబర్ 12న భారత్‌కు అద్వానీ వలస వచ్చారు.
1957లో ఆర్‌ఎస్‌ఎస్ పిలుపుతో ఢిల్లీకి అద్వానీ.
1960లో ఆర్గనైజర్ పత్రికలో జర్నలిస్ట్‌గా విధుల్లో చేరారు.
1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక.
1970లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నిక.
1973-76లో జన్‌సంఘ్ అధ్యక్షుడిగా అద్వానీ ఎన్నికయ్యారు.
1977లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం
1977 మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖామంత్రిగా నియామకం
1980 రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.
1990 సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర నిర్వహించారు
1998 వాజపేయ్ మంత్రివర్గంలో హోంమంత్రిగా వ్యవహరించారు
2002 ఉప ప్రధానమంత్రిగా నియామకం.
2004 లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు
2005 జిన్నాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు వదలిపెట్టాల్సి వచ్చింది
2007 ప్రధాన మంత్రి అభ్యర్థిగా పార్టీ నిర్ణయించింది
2008 "మై కంట్రీ, మై లైఫ్" పేరుతో స్వీయచరిత్రను విడుదల చేశాడు.
మలుపు తిప్పిన అయోధ్య రథయాత్ర..
అద్వానీ జీవితంలోనే కాదు దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన సంఘటన అయోధ్య రథయాత్ర. సోమనాథ దేవాలయం నుంచి అయోధ్యకు రథయాత్ర చేసి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి ప్రజల మద్దతు పొందడమే ఆశయంగా పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన 1990, సెప్టెంబర్ 25న ప్రారంభమైంది. అయోధ్య రథయాత్ర బీహార్ సరిహద్దులో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీ రథయాత్రకు పగ్గాలు వేయడంతో ఆగిపోయింది. 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేసి అక్టోబర్ 30న అయోధ్య చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్న రథయాత్ర ఆగిపోయినప్పటికీ అద్వానీ విశేష ప్రజాదరణను పొందారు. ఆ తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్(వీపీ సింగ్) ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించడం, ఆ తర్వాత 1991 లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ స్థానాల సంఖ్యను 120కు పెంచిన ఘనత అద్వానీదే. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో జరిగిన కరసేవ సంఘటనలో అద్వానీ అరెస్ట్ అయ్యాడు.
పార్టీ అధ్యక్ష పదవిలో అద్వానీ
కొన్నేళ్ల క్రితం వరకు అద్వానీ దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహించారు. అద్వానీ మొట్టమొదటి సారిగా 1986లో అటల్ బిహారీ వాజపేయి నుంచి పార్టీ పగ్గాలు స్వీకరించి 1991 వరకు, రెండోసారి 1993 నుంచి 1998 వరకు పార్టీ అధిపతిగా పనిచేశారు. చివరగా 2004 నుంచి 2005 వరకు పార్టీని నడిపించి ఆ తర్వాత రాజ్‌నాథ్‌సింగ్‌కు తన స్థానాన్ని అప్పగించాడు. తన అధ్యక్ష పదవీ కాలంలో పార్టీకి మెరుగైనస్థితిలోకి తీసుకొని వచ్చి భారతీయ జనతా పార్టీ ‘ఉక్కుమనిషి’గా పేరుగాంచాడు. రామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనకు భారతరత్న ప్రకటించడంతో బీజేపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
కేంద్ర ప్రభుత్వం.. భారతరత్నను ప్రకటించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. బీహార్ మాజీ సీఎం, అనేక మంది ప్రముఖులకు రాజకీయ గురువు అయిన దివంగత దిగ్గజ నేత కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ఇస్తున్నట్టు కేంద్రం జనవరి 23న ప్రకటించింది. ఇప్పటివరకూ 49 మంది ప్రముఖులు ‘భారతరత్న’ను అందుకున్నారు. వీరిలో 17 మందికి మరణానంతరం భారతరత్న లభించింది. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మొదలుకొని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు.. ఇలా పలువురు ‘భారతరత్న’ అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment