సింగపూర్‌లో "స్వర లయ ఆర్ట్స్ " సంస్థ ఆగష్టు 14వ తేదీ సాయంత్రం శ్రీ గురు కళాంజలి కార్యక్రమ మొదటి భాగాన్ని యుమీ గ్రీన్ హాల్ నుంచి యూట్యూబ్, ఫేస్ బుక్ లైవ్ ద్వారా అద్వితీయంగా నిర్వహించారు. స్వర లయ ఆర్ట్స్ విద్యార్థులైన చిన్నారులు బొమ్మకంటి అనన్య, షణ్మిత తంగప్పన్లు ప్రార్ధనాగీతంతో ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. పప్పు పద్మా రవిశంకర్ (ఆల్ ఇండియా రేడియో, విశాఖపట్నం A గ్రేడ్ ఆర్టిస్ట్ ) తమ వీణావాదనతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేయగా వారి తనయులు పప్పు జ్ఞానదేవ్ వయోలిన్, పప్పు జయదేవ్ మృదంగ సహకారంతో సాగిన సంగీతఝరి మరింత రక్తి కట్టింది.
అనంతరం స్వర లయ ఆర్ట్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషు కుమారి కళాకారులతో వారి గురు పరంపర, వారి గురువుల విద్యాబోధనా విధానాల గురించి ఇంటర్వ్యూ రూపంలో చర్చించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. ఈ సందర్భంగా యడవల్లి శేషు కుమారి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో కళాకారుల ప్రదర్శనలతో పాటు, వారి గురువుల కళావిశిష్టత, వైవిధ్యం మున్నగు అంశాలపై చర్చలతో విజ్ఞానవంతముగా ముందుతరాలకు ఉపయుక్తంగా రూపొందించబడింది. ఈ శీర్షికలో సమర్పించనున్న కార్యక్రమాలలో ఇది మొదటిభాగమని పేర్కొన్నారు.
ప్రత్యేక అతిధిగా సంగీత సుధానిది గుమ్ములూరి శారద సుబ్రహ్మణ్యం కళాకారులకు అభినందనలు తెలిపారు. శ్రీ గురు కళాంజలి ప్రోగ్రాం గురువుల గూర్చి ఎన్నో విషయాలను తెలుసుకునే విధంగా ఉందని మరిన్ని కార్యక్రమాలు చెయ్యాలని సంస్థకు ఆశీస్సులను అందించారు.ఈ కార్యక్రమానికి కవుటూరు లలితా రత్నకుమార్, సౌభాగ్యలక్ష్మి రాజశేఖర్, విద్యాధరి , రాధిక నడదూరు మున్నగు ప్రముఖులు, స్నేహితులు విచ్చేసి హర్షం తెలియజేశారు. బొమ్మకంటి సౌజన్య పరిచయ కర్తగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment