సింగపూర్: లోక కల్యాణార్థం శ్రీప్లవ నామ సంవత్సర ఉగాది రోజున (ఏప్రిల్ 13) సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సింగపూర్‌లోని సెరంగూన్ రోడ్డులో ఉన్న శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. శ్రీవారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, అభిషేకంతో పాటు మహా గణపతి, విష్ణుదుర్గ, మహాలక్ష్మి, ఆంజనేయస్వామి వార్లకు అభిషేకం మొదలగు విశేష పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం శ్రీవారి ఆస్ధానంలో బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం పఠించారు.
కరోనా పరిస్థితుల దృష్ట్యా సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, హిందూ ఎండోమెంట్స్ బోర్డ్ నిర్దేశించిన మార్గదర్శకాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయానికి వచ్చే భక్తుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించడం, భక్తుల వివరాల సేకరించడంతో పాటు భక్తులు భౌతిక దూరాన్ని పాటించేలా వివిధ ఏర్పాట్లు చేశారు. కలియుగ దైవం కృప అందరికీ కలగాలనే సత్సంకల్పంతో భక్తులు ఇంటి నుంచే శ్రీనివాస కల్యాణోత్సవం వీక్షించేలా ఫేస్‌బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు.
షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని ప్రత్యేక ప్యాకెట్లో సుమారు 2000 మందికి అందించారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు కోటిరెడ్డి తెలుగువారందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పంచాంగ పఠనం చేసిన నాగఫణి శర్మకు, బండారు దత్తాత్రేయ గారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్ పోలిశెట్టి, కార్యదర్శి సత్యచిర్ల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment