త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి సన్మానించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘము (తానా) అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి గుంటూరు జిల్లా మాచర్లలోని సీతామహాలక్ష్మీ ఇంటికి వెళ్లి ఆమెను పరామార్శించారు. ఆ తర్వాత తానా తరఫున జ్ఞాపిక అందించి పూలమాల, శాలువాతో సత్కరించారు.
ఈ సంధర్భంగా తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్న భారతీయులందరూ మన త్రివర్ణ పతాకాన్ని వినువీధుల్లో రెపరెపలాడిస్తూ.. భారత దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో జరుపుకునేందుకు సమాయత్తం అవుతున్నారని తెలిపారు. ఈ తరుణంలో భారత జాతీయ పతాక రూపకల్పన జరిగి 100 ఏళ్లు పూర్తైన సంధర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడు త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబాన్ని సన్మానించామన్నారు. ఈ సన్మానం తన తండ్రికే స్వయంగా జరిగినట్టు భావిస్తున్నట్లు సీతామహాలక్ష్మీ స్పందించారు. తానాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా బోర్డు సభ్యులు జనార్ధన్ నిమ్మలపూడి, పింగళి వెంకయ్య మనుమడు జీవీఎన్ నరసింహంతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, మాచర్లలోని మీనాక్షి కంటి ఆసుపత్రి ట్రస్ట్ చైర్మన్ చిరుమామిళ్ల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment