తానా నూతన అధ్యక్షుడిగా అంజయ్య చౌదరి | Tana New President As Anjaiah Chowdary | Sakshi
Sakshi News home page

తానా నూతన అధ్యక్షుడిగా అంజయ్య చౌదరి

Published Sat, Jul 17 2021 10:25 PM | Last Updated on Sat, Jul 17 2021 10:26 PM

Tana New President As Anjaiah Chowdary - Sakshi

వాషింగ్టన్‌: నీతి, నిజాయితీ, నిరాడంబరత, మంచితనం, మాటకు బద్దులై వుండటం, మానవతా దృక్పథం, ప్రజా సేవా తత్పరత మొదలైన సాత్విక లక్షణాలన్నింటి సమాహారమే అంజయ్య చౌదరి లావు. అగ్రరాజ్యం అమెరికాలో ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద తెలుగు సంస్థ తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) నూతన అధ్యక్షుడిగా ( 2021-23) బాధ్యతలు స్వీకరించ బోతున్న మానవత్వం పరిమళించిన మంచి మనిషి  అంజయ్య చౌదరి లావు ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారందరూ మనసా, వాచా, కర్మణా  స్వాగతిస్తున్నారు. మాటల్లో నిష్కల్మషం, ఆచరణలో నిజాయితీ, అంజయ్య చౌదరి లావు ఔన్నత్యానికి నిదర్శనం. కష్టపడటం కాలంతో పరిగెత్తడం, అనుకున్న లక్ష్యం సాధించే వరకు అనునిత్యం అలుపెరగని పయనం సాగించనున్నారు.

తెలుగు వారి పట్ల ప్రేమ వారి సమస్యల పరిష్కారం కొరకు కడదాకా పోరాడే యోధుడు అంజయ్య చౌదరి లావు . డాలర్ల వేటలో మానవ సంబంధాలను మరుస్తున్న ఈరోజుల్లో ఖండాంతరాల అవతల కూడా కాసులకు అతీతంగా సేవలందించి అందరి మన్ననలను పొందుతున్న తెలుగుతేజం అంజయ్య చౌదరి లావు. తానా అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయడం నిజంగా పర్వదినం. తన కుటుంబ శ్రేయస్సు కాకుండా అమెరికాలోని తెలుగువారు కుటుంబాలను కూడా తన కుటుంబంగా భావించి ఆపదలో ఉన్నవారు ఎవరైనా ఏ సమయంలో వచ్చినా వెంటనే స్పందించి , వారికి కొండంత ధైర్యాన్ని కల్పించి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్ధంగా సేవ చేస్తున్న అంజయ్య చౌదరి లావు కి అభినందనలను తెలియజేశారు. తెలుగువారి సేవలో పరమాత్మను సేవిస్తూ తన సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకొని పోతూ తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకోవాలని అంజయ్య చౌదరి లావు లక్ష్యం . ఆ లక్ష్య సాధన కోసమే ఆయన నిరంతరం ఆరాటపడుతున్నారు.   

కృష్ణా జిల్లా ముద్దుబిడ్డ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని ఉన్న పెద్దఅవుటుపల్లి గ్రామంలో లావు సాంబశివరావు - శివరాణి దంపతులకు 1971 మార్చి 27 న అంజయ్య చౌదరి జన్మించారు. తండ్రి వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగిగా విశాఖపట్నంలో పనిచేయడం వలన అంజయ్య చౌదరి చిన్నతనంలోనే బాబాయి లావు రంగారావు,పిన్నమ్మ  కోటేశ్వరమ్మ ల సంరక్షణలో పెరిగారు. ప్రాథమిక విద్యాభ్యాసమంతా గన్నవరం లోని సెయింట్ జాన్స్ హైస్కూల్లోనూ, ఇంటర్మీడియట్ విజయవాడలోని గౌతమి రెసిడెన్షియల్ కళాశాలలో, ఉన్నత విద్య బీటెక్ బళ్ళారి లోను, ఎంటెక్ గుల్బర్గా కళాశాలలో పూర్తిచేశారు.  
పూవు పుట్టగానే పరిమళించినట్లు గా అంజయ్య చౌదరి చిన్నతనం నుండే సేవా దృక్పథాన్ని అలవర్చుకున్నారు.

1988 లో అమెరికా వెళ్లి అట్లాంటాలో నివాసమున్నారు. 1997 లో అనకాపల్లి కి చెందిన నతాషా తో వివాహం జరిగింది. అంజయ్య చౌదరి లావు గారికి ఇద్దరు సంతానం. కుమారుడు శ్రీకాంత్ చౌదరి, కుమార్తే  అక్షిణ శ్రీ చౌదరి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ,వారికి ఆపన్నహస్తం అందించడంలోనే జీవిత పరమార్థం దాగి ఉన్నదని భావించే అంజయ్య చౌదరికి కుటుంబ ప్రోత్సాహం బాగా తోడయింది. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ సహకారం తప్పక ఉంటుందనే అక్షరసత్యం నిజం చేస్తూ అంజయ్య చౌదరి లావు ప్రతి విజయం వెనుక వారి ధర్మపత్ని చేయూత, ప్రోత్సాహం ఉంది. ఆమె ప్రోద్బలంతోనే అంజయ్య చౌదరి సేవా కార్యక్రమాలకు  ఎదురులేకుండా   ( తానా ఎమర్జెన్సీ అసిస్టెంట్స్ మేనేజ్మెంట్ ) తానా టీమ్ స్క్వేర్ అంజయ్య చౌదరి లావుగా పేరుపొందారు.

పేద ప్రజల గుండెచప్పుడు
పెద అవుటపల్లి పల్లి గ్రామంలో ప్రజలకు ఎలాంటి అనారోగ్యం కలిగినా కార్పొరేట్ వైద్యులు వారి తలుపు తట్టి ఉచితంగా వారికి రోగాలు నయం చేస్తున్నారు . ఈ సామాజిక, ఆరోగ్య చైతన్యం వెనుక ఉన్నది ఒకే ఒక్కరు. ఆయనే అంజయ్య చౌదరి లావు. తన చుట్టూ ఉన్న సమాజం బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మి , సొంత లాభం కొంత మానుకొని స్వగ్రామానికి తోడ్పాటును అందించాలనే జన హితుడు ఆయన పేర్కొన్నారు. విజయవాడ మణిపాల్ హాస్పటల్ వైద్యబృందం సహకారంతో హృద్రోగ వైద్య శిబిరం ఏర్పాటు చేసి, గుండె వ్యాధులు ఉన్న వారిని గుర్తించి అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వైద్యుల సహకారంతో క్యాన్సర్ వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి అవసరమైన వైద్య సహాయం అందించారు.

జైపూర్ నుండి వికలాంగులకు అవసరమైన కృత్రిమ అవయవాలను తెప్పించి పంపిణీ చేయించారు. తాను ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నా తాను పుట్టి పెరిగి నడిచివచ్చిన దారిని మర్చిపోకుండా అందరినీ కలుపుకొని పోతూ తన స్వగ్రామం పెద్ద ఉటపల్లి అభివృద్ధికి నడుం బిగించిన అజాతశత్రువు అంజయ్య చౌదరి. "ఇంటికో పువ్వు అయితే ఈశ్వరుని కో మాల అని నమ్మి " ఎన్నో సేవా కార్యక్రమాలకు స్వయంగా అంజయ్య చౌదరి విరాళం అందించారు . మిత్రులు సహృదయులు వద్ద నుండి విరాళాలు సేకరించి గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు.

గ్రామంలోని అనాధ పిల్లలకు, వృద్ధులకు బట్టలు పంపిణీ చేశారు. నిరు పేద పిల్లలకు కానుకలు, ఆటబొమ్మలు పంపిణీ, విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు పంపిణీ, అనాధ శరణాలయం లో అన్నదానం, గ్రామంలో మొక్కలు నాటడం చేపట్టారు. తానా  స్కాలర్షిప్పులు వంటి ఎన్నో మంచి కార్యక్రమాలకు తన వంతు సహాయం అందించారు. భారతదేశంలో పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం పొందిన విద్యార్థికి బంగారు పతకాన్ని ప్రదానం చేశారు. గ్రామాభివృద్ధి లో చౌదరి అలుపెరుగని కృషి చేస్తున్నారు.

 పెద్ద అవుటపల్లి గ్రామంలో మొదలైన అంజయ్య చౌదరి లావు సామాజిక సేవా పరిమళం మెల్లమెల్లగా అమెరికా అంతా వ్యాపించింది . అమెరికన్ రెడ్ క్రాస్ ఇతర జాతీయ ప్రాంతీయ సంస్థలు నిర్వహించిన రక్తదాన శిబిరాల నిర్వహణ లో అంజయ్య చౌదరి చురుగ్గా పాల్గొన్నారు. గత 22 సంవత్సరాలుగా జరిగిన అనేక రక్తదాన శిబిరాల్లో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అక్కడ నిర్వహించే వైద్య శిబిరాలు తగిన హాల్స్ ఏర్పాటు చేయడం, కార్యకర్తలను సమకూర్చటం, ధన సహాయం చేయడం, వైద్యం కోసం వచ్చిన వారికి తగిన వసతి సౌకర్యాలను కల్పిస్తున్నారు. " ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న " అనే నానుడిని ప్రగాఢంగా విశ్వసిస్తూ సాటి మనిషికి సాయం పడటం వారికి ప్రేమను పంచడం ఇవే నా జీవితాన్ని నడిపించే అంజయ్య చౌదరి లావు మూలసూత్రాలంటారు

అన్నదానం
" అన్నం పరబ్రహ్మ స్వరూపం " అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టి వారిని ఆదుకోవడం కన్నా మంచి పని ఏమి ఉంటుందని భావించారు అంజయ్య చౌదరి లావు. భగవంతుడు తనకు ఇచ్చిన శక్తి స్తోమతను బట్టి  గత 20 సంవత్సరాలుగా నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనేక వృద్ధ శరణాలయాల్లో అన్నదానం చేస్తూ అందరి అభిమానాన్ని అంజయ్య చౌదరి లావు చూరగొన్నాడు.

పదవులకే వన్నెతెచ్చిన అంజయ్య చౌదరి లావు
అంజయ్య చౌదరి లావు పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదు. పదవులే ఆయనను వరించాయి . వరించిన ప్రతి పదవికి ఆయన వన్నె తెచ్చాడు. అతి చిన్న వయసులోనే అనేక పదవులు చేపట్టారు. తానా టీమ్ స్క్వేర్ చైర్మన్ గా మొదలైన వారి ప్రయాణం నేడు తానా అధ్యక్షులు వరకూ వచ్చింది.

"తానా" టీమ్ స్క్వేర్ చైర్మన్ (2011-13)
"తానా" సంయుక్త కోశాధికారి ( 2013-15)
"తానా" టీమ్ స్క్వేర్ మెంటర్ చైర్మన్ (2013 -15 )
"తానా" కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ (2015 - 17 )
"తానా' టీమ్ స్క్వేర్  కో చైర్ (2015 - 17)
"తానా" జనరల్ సెక్రటరీ (2017 - 19)
 తానా టీమ్ స్క్వేర్ చైర్మన్ ( 2017 -19)
"తానా" ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (2019 - 21 )
"తానా" ప్రెసిడెంట్ ( 2021 -23)

తెలుగు వారి సేవలో
 అమెరికాలో ఉద్యోగం చేస్తూనే అంజయ్య చౌదరి లావు అక్కడి తెలుగు వారి సమస్యల పరిష్కారం కోసం తానా సంస్థలో సభ్యులుగా చేరారు. తెలుగువారు హత్యకు గురైనా, రోడ్డు ప్రమాదాల్లో మరణించినా వారి మృతదేహాలను ఇండియాకు తీసుకురావడంలో జరిగే ప్రాసెస్ మొత్తాన్ని దగ్గరుండి అన్ని తానై పూర్తి చేసేవారు. ఎన్ఆర్ఐ తల్లిదండ్రులు ఇండియా నుండి అమెరికా కి వెళ్లి ఇబ్బందులకు గురైతే వారికి అండగా నిలిచారు. హెల్త్ ఇన్సూరెన్స్ , ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, ఫేస్బుక్ సమాచారం ఆధారంగా ఇబ్బందుల్లో ఉన్న వారి సమాచారాన్ని తెలుసుకొని వారికి సహాయపడేవారు.

కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ గా సుమారు 100 కు పైగా సేవా కార్యక్రమాలు అమెరికా వ్యాప్తంగా చేశారు. ముఖ్యంగా బోన్మారో డ్రైవ్ , బ్లడ్ డ్రైవ్, ఫుడ్ అండ్ టాప్ డ్రైవ్, ట్రైనింగ్ వర్క్ షాప్, టాక్స్ సెమినార్లు, ఫైనాన్స్ ప్లానింగ్ సెమినార్ నిర్వహించి ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యం పెంపొందించుకొనేలా తన వంతు సహాయం అందించారు. ఆపదలో ఉన్న తెలుగు వారిని ఆదుకునేందుకు 2008వ సంవత్సరంలో ప్రారంభించబడిన టీమ్ స్క్వేర్ సంస్థకు చైర్మన్ గా పనిచేసిన కాలంలో అంజయ్య చౌదరి చేసిన సేవలు అనిర్వచనీయం.

రాత్రింబవళ్ళు శ్రమిస్తూ సుమారు 600 మంది కార్యకర్తలను సంధాన పరుస్తూ సేవా యజ్ఞాన్ని కొనసాగించారు. రానున్న రోజుల్లో "తానా" కీర్తి బావుటా తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిపేందుకు ,తానా  యాష్చంద్రిక లను దశదిశలా వ్యాపింప చేసేందుకు అంజయ్య చౌదరి లావు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఆశిద్దామని పేర్కోనారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement