తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వహణలో – మన ప్రాచీన భారతీయ సాహిత్యం – ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ సదస్సు డాలస్, టెక్సాస్: తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 66 వ సాహిత్య సమావేశం: మన ప్రాచీన భారతీయ సాహిత్యం – ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే కార్యక్రమం ఘనంగా, విజ్ఞానదాయకంగా జరిగింది.
తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ - విజ్ఞానశాస్త్రంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న ప్రముఖులు పాల్గొంటున్న ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకం అంటూ, అతిథులందరినీ ఆహ్వానిస్తూ సభను ప్రారంభించారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ .. “ఎన్నో వేల సంవత్సారల క్రితమే ఖగోళశాస్త్రం, గణితశాస్త్రం, విజ్ఞానశాస్త్రం, ఆయుర్వేదశాస్త్రం, వృక్షశాస్త్రం, శిల్పశాస్త్రం, శబ్దశాస్త్రం, కాలశాస్త్రం లాంటి అనేక శాస్త్రాలకు పుట్టినిల్లు అఖండ భారతదేశం. ఎంతోమంది వీరులకు, శూరులకు, శాస్త్రవేత్తలకు, పండితులకు నిలయమై, నలంద, తక్షశిలల లాంటి విశ్వవిద్యాలయాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించి ఒక గొప్ప విజ్ఞానగనిగా విరాజిల్లిన ఘనచరిత్ర కల్గిన భారత మూలాలపై ఇంకా ఎంతో పరిశోధన జరుగవలసి ఉంది అన్నారు”.
ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పూర్వ సంచాలకులు, చంద్రయాన్-3 కీలక శాస్త్రవేత్త అయిన డా. జోశ్యుల అచ్యుత కమలాకర్ తన ప్రసంగంలో ఇప్పటివరకు ఇస్రో సాగించిన ప్రయోగాలు, సాధించిన విజయాలు, గత సంవత్సరం ప్రపంచంలోనే మొదటిసారిగా చంద్రుని దక్షిణ ద్రువంపై దిగిన మొదటి దేశంగా భారత్ ఉండడం, చంద్రునిపై నీరు ఉన్నదని మొదటిసారిగా కనుగొన్న దేశం భారతదేశం కావడం, అతి తక్కువ వ్యయంతో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంతరిక్ష పరిశోధనలలో ప్రపంచంలోనే మొదటి 5 దేశాలలో ఒకటిగా భారతదేశం ఉండగల్గడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం అన్నారు. 30 నిమిషాలకు పైగా సాగిన తన పవర్ పాయింట్ ప్రజంటేషన్లో ఇస్రో త్వరలో చేపట్టబోయే అనేక ప్రయోగాలతో సహా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుని అందర్నీ ఆకర్షించారు.
విశిష్టఅతిథిగా హాజరైన ప్రఖ్యాత రచయిత, సైన్సు ప్రచారానికి విశేష కృషి చేస్తున్న ఆకాశవాణి పూర్వ ఉన్నతోద్యోగి డా. నాగసూరి వేణుగోపాల్ మాట్లాడుతూ – “మన ప్రాచీన భారతీయ వాంగ్మయ విషయాలను సరిగా అర్థం చేసుకోవడం, వాటిని సరైన అవగాహనతో ప్రపంచంలోని అనేక ఇతర భాషల్లోకి అనువదించ వలసిన ఆవశ్యకత, ముఖ్యంగా విజ్ఞానశాస్త్ర పరివ్యాప్తికి ప్రభుత్వాలు, సంస్థలు కృషి చేసి యువతరంలో చైతన్యం తీసుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.” ప్రముఖ రచయిత, విశ్రాంత అధ్యాపకులు, అనేక సైన్స్ సదస్సులు, సైన్స్ ప్రసంగాలు చేసిన డా. ప్రతాప్ కౌటిల్య తన ప్రసంగంలో బాల్యంనుంచే విధ్యార్ధులలో సైన్స్ పట్ల ఆసక్తి కల్గేలా కొన్ని చిన్న చిన్న ప్రయోగాలతో అభిరుచి కల్పిస్తే, దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలు తయారవుతారన్నారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వారా వీక్షించవచ్చును.
Comments
Please login to add a commentAdd a comment