లక్సెట్టిపేట(మంచిర్యాల): ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్సెట్టిపేటకు చెందిన రాజు(30) మృతిచెందాడు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి ఉద్యోగం సాధించి స్థిరపడిన సమయంలో ఒక్కసారిగా మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్సెట్టిపేట పట్టణంలోని అంగడిబజార్‌కు చెందిన చీకటి కొమురయ్య, కమల దంపతులు పిండిగిర్ని నడుపుతూ పిల్లలను చదివిస్తున్నారు. కుమార్తెకు వివాహం జరుగగా.. పెద్ద కుమారుడు రాజు ఆస్ట్రేలియా దేశంలో ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగం సంపాదించాడు. చిన్న కుమారుడు సాయికిరణ్ ఎంబీఏ చదువుతున్నాడు. రాజు ఇంటర్మీడియెట్ వరకు పట్టణంలో, హైదరాబాద్‌లో బీటెక్ పూర్తిచేసి ఎంఎస్ చదవడానికి 2018లో ఆస్ట్రేలియా వెళ్లాడు. రెండేళ్లలో ఎంఎస్ పూర్తి చేసి గత సంవత్సరం అక్కడి పోస్టల్ డిపార్టుమెంటులో ఉద్యోగం చేస్తున్నాడు.
ఆదివారం రాత్రి
ఆదివారం రాత్రి స్నేహితులతో కారులో ఇతర ప్రాంతానికి వెళ్లి తిరిగి వస్తుండగా సిడ్నీ పరిధి క్యూస్‌ల్యాండ్ వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో రాజు మృతిచెందాడు. ఈ విషయం అతడి స్నేహితుల ద్వారా తెలిసింది. మార్చిలో స్వదేశానికి వచ్చి పెళ్లి చేసుకోవాల్సి ఉండగా ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో రాజు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి మృతదేహాన్ని స్వదేశానికి త్వరగా తెప్పించాలని కోరుతున్నారు.
సాయం చేయండి
రాజు మృత దేహాన్ని ఇండియాకు రప్పించేందుకు సాయం చేయాల్సిందిగా మృతుడి సన్నిహితులు మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్ ద్వారా కోరారు. వెంటనే స్పందించిన మంత్రి ఆస్ట్రేలియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి తగు సాయం చేస్తానని హామీ ఇచ్చారు.
చదవండి: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ టీనేజర్ల మృతి
Comments
Please login to add a commentAdd a comment