బ్రిటన్‌ ప్రధానిగా రిషి.. యూకేలో ప్రవాసీయుల ఖుషీ | Telugu NRIs Expressed Happiness over Rishi Sunak Elected as a Britain PM | Sakshi
Sakshi News home page

Rishi Sunak: బ్రిటన్‌ ప్రధానిగా రిషి.. యూకేలో ప్రవాసీయుల ఖుషీ

Published Fri, Oct 28 2022 4:44 PM | Last Updated on Fri, Oct 28 2022 4:44 PM

Telugu NRIs Expressed Happiness over Rishi Sunak Elected as a Britain PM - Sakshi

రాయికల్‌(జగిత్యాల): సుమారు రెండువందల సంవత్సరాల పాటు మనదేశాన్ని బ్రిటిష్‌ వారు పరిపాలించారు. ప్రస్తుతం భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధానమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీపావళి పర్వదినాన ఆయన ఎన్నికవడంపై యూకేలో స్థిరపడిన ప్రవాస భారతీయులు పండుగను ఘనంగా జరుపుకున్నారు. రిషి ఎన్నికపై ప్రవాసీయులు ‘సాక్షి’తో తమ మనోభావాలు పంచుకున్నారు. వారి మాటల్లోనే..


ఆర్థిక విధానాలతోనే ప్రజాదరణ 

మాది హైదరాబాద్‌. నేను ఉద్యోగ రీత్య బ్రిటన్‌లో పనిచేస్తున్నా. భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్ర ధానిగా పీఠం అధిరోహించడం ఆనందంగా ఉంది. యూకేలో కరోనా మహమ్మారి సమయంలో రిషి రూపొందించిన ఆర్థిక సంస్కరణలతో ప్రజల్లో ఆదరణ పెరిగింది. ప్రతి ఒక్కరూ ఆయన ఆర్థిక విధానాలతో యూకేలో పూర్వ వైభవం తీసుకువస్తారనే ఆశతో ఎన్నుకున్నారు.
– సిక్క చంద్రశేఖర్, ఎన్‌ఆర్‌ఐ, లండన్‌


సమర్థవంతంగా పాలిస్తారు 

మాది నల్గొండ జిల్లా కేతుపల్లి మండలం తుంగతుర్తి గ్రామం. భారత సంతతికి చెందిన రిషి యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంతో ఆనందంగా ఉంది. ఆయన అనేక సమస్యలు, సవాళ్లు ఎదుర్కొంటూ ముందుకు సాగుతారనే నమ్మకం ఉంది. ప్రస్తుతం బ్రిటన్‌లో ఆర్థిక మాంధ్యం నుంచి ముందుకు నడిపిస్తారనే నమ్మకంతో ప్రజలు, కన్జర్వేటివ్‌ పార్టీలో నెలకొన్న అనిశ్చితిని సరిదిద్దగల శక్తి రిషికి ఉందనే నమ్మకం ఉంది.      
– సతీశ్‌రెడ్డి, లండన్‌


ప్రతిపక్షాలను సమన్వయం చేస్తారు 

మాది మహబూబాబాద్‌ జిల్లా కంబంపల్లి. యూకే ప్రధానిగా రిషి సునాక్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ప్రతిపక్షంలోని సభ్యులకు కేబినేట్‌లో మంత్రి పదవి ఇచ్చారు. దీనిద్వారా ఆయన రాజకీయ చాతుర్యం యూకేలోని అన్ని పార్టీలకు తెలిసింది. పడిపోతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే సత్తా రిషి సునాక్‌కు ఉంది. ఇండియా, యూకే సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది.
– సతీశ్‌కుమార్, నార్తర్న్‌ ఐర్లాండ్‌


మంచి ఆర్థిక నిపుణుడు

మాది హైదరాబాద్‌. బ్రిటన్‌ ప్రధాని రిషి యూకేలో మాజీ ఆర్థికమంత్రిగా పనిచేశారు. యూకేలో ఆర్థిక సంక్షోభం గురించి పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి. చిన్నవయసులోనే ప్రధాని కావడం, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న యూకేకు పూర్వ వైభవం తెస్తారనే నమ్మకం ప్రజలు, నాయకుల్లో ఉంది.
– దూసరి అశోక్‌గౌడ్, ఎన్‌ఆర్‌ఐ, బీఆర్‌ఎస్‌ యూకే ప్రెసిడెంట్‌


గర్వంగా ఉంది 

నాది కరీంనగర్‌ జిల్లా కేంద్రం. మొన్నటివరకు లండన్‌లో ఉద్యోగం చేశా. బ్రిటన్‌ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ బాధ్యతలు స్వీకరించడం గర్వంగా ఉంది. ముఖ్యంగా భారత్, బ్రిటన్‌ల మధ్య అనేక సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. యూకేలో భారతీయులకు ఒక భరోసా నెలకొల్పింది. ఆర్థిక వ్యవస్థ మళ్లీ మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. 
– కూర్మాచలం అనిల్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement