మైనర్ బాలుడికి వాతలు పెట్టారన్న తండ్రి
రూ.8 కోట్లు నష్టపరిహరం ఇప్పించాలని కేసు
అమ్మవారి సాక్షిగా అమానుషం జరిగిందని ఆవేదన
జీయర్ ట్రస్టు అమెరికాలో ఓ వివాదంలో ఇరుక్కుంది. టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్‌లో ఒక భారతీయ అమెరికన్ తండ్రి, ఒక హిందూ దేవాలయం, దాని మాతృ సంస్థపై మిలియన్ డాలర్ల దావా వేశాడు. ఆలయంలో జరిగిన ఓ వేడుకకు హాజరైన తన మైనర్ అయిన 11 ఏళ్ల కొడుకుకు పూజారులు వాతలు పెట్టి, అమానుషంగా ప్రవర్తించారంటూ బాలుడి తండ్రి ఫోర్ట్ బెండ్ కౌంటీకి చెందిన విజయ్ చెరువు కోర్టును ఆశ్రయించాడు.
జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (JET) USA Inc ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న షుగర్ ల్యాండ్‌లోని అష్టలక్ష్మి ఆలయంలో వేడుకలో భాగంగా ఇనుప కడ్డీని ఎర్రగా కాల్చి తన మాజీ భార్యతోపాటు గుడికి వెళ్లిన తన కొడుకు రెండు భుజాలకు శంఖు చక్రాల గుర్తులు వేశారని తెలిపారు. దీంతో పిల్లవాడు తీవ్రమైన నొప్పితో రోజుల తరబడి బాధ పడ్డాడని, ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి పరిహారంగా 10 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.8.33 కోట్లు) పరిహారంగా ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యవహారాన్ని ఆపకుండా ఆలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైద్య సేవలు కూడా అందించలేదని ఆరోపించారు.
బాలుడి కుడి, ఎడమచేతిపై వాతలు
పలు మీడియా నివేదికల ప్రకారం తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా ఈ పని చేశారంటూ ఏప్రిల్ 1 న కోర్టులో దావా దాఖలయింది. ఈ ఘటన ఆగస్టు 5న జరిగినట్లు తెలుస్తోంది. పేరెంట్స్ అనుమతిచ్చినా సరే ఇలా మైనర్ శరీరంపై వాతలు పెట్టడం నేరమని విజయ్ న్యాయవాది ఆండ్రూ విలియమ్స్ వాదించారు. టెక్సాస్ హెల్త్ అండ్ సేఫ్టీ కోడ్ ప్రకారం తల్లిదండ్రుల అనుమతి ఉన్నా.. లేకున్నా.. బాలలకు పచ్చబొట్లు పొడవడం, కర్రు పెట్టి ముద్ర వేయడం చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు. అమెరికన్ చట్టాల ప్రకారం ఇది నేరమేనని తెలిపారు. ఈ కేసులో బాలుడి గాయాలను థర్డ్ డిగ్రీగా పరిగణిస్తారని, కాలిన గాయాలు వీటికి సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ గాయాలపై డాక్టర్‌ను సంప్రదించినపుడు ఈ గాయాలను గురించి పోలీసులకు నివేదించమని వైద్యుడు కూడా పట్టుబట్టారని లాయర్ విలియమ్స్ వివరించారు. అయితే ఈ వ్యవహారంపై జీయర్ ట్రస్టు నిర్వాహకులు కానీ, ఆలయ కమిటీగానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment