ఛార్లెట్‌లో గ్రాండ్‌గా టీటీఏ బోర్డ్‌ మీటింగ్ | TTA Board Meeting held At Charlotte | Sakshi
Sakshi News home page

ఛార్లెట్‌లో గ్రాండ్‌గా టీటీఏ బోర్డ్‌ మీటింగ్

Published Sat, Feb 10 2024 11:51 AM | Last Updated on Sat, Feb 10 2024 12:13 PM

TTA Board Meeting held At Charlotte - Sakshi

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ టీటీఏ బోర్డు మీటింగ్ ఛార్లెట్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఏడాదిలో జరిగిన మొట్టమొదటి బోర్డు సమావేశం‌లో పలు కీలక అంశాలపై చర్చించారు.  వాషింగ్టన్ లోని సియాటెల్‌లో జరిగే టీటీఏ మహాసభల గురించి ముఖ్యమైన చర్చా కార్యక్రమం నిర్వహించారు. 

అలాగే ఇటీవల జరిగిన సేవా డేస్ కార్యక్రమాలతో పాటు మెగా కన్వెన్షన్ ఫండ్ రైజింగ్ గురించి చర్చించారు.  అంతకుముందు టీటీఏ సభ్యులు భారీ కారు ర్యాలీ నిర్వహించారు. బోర్డు సమావేశానికి సంస్థ సభ్యులు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చారు. ఈ సమావేశానికి హాజరైనా సంస్థ వ్యవస్థాపకులు, బోర్డ్‌ నాయకులకు ఘన స్వాగతం పలికారు.

ఇటీవల కన్నుమూసిన  ప్రజాగాయకుడు గద్దర్‌కి టీటీఏ బోర్డు ఘన నివాళులు అర్పించింది. సంస్థ సభ్యులు గద్దర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు. తన ఆట, పాటలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారని, ప్రజాగాయకుడిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. గద్దర్ ఆలపించిన పాటలు పాడి ఆయన్ను గుర్తు చేసుకున్నారు.

  

అనంతరం నిర్వహించిన టీటీఏ బోర్డు మీటింగ్‌లో సంస్థ వ్యవస్థాపకులు, బోర్డ్‌ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. టిటిఏ వ్యవస్థాపకులు డాక్టర్‌ పైళ్ల మల్లా రెడ్డి బోర్డ్‌ ప్రారంభ సందేశం వివరించారు. సియాటెల్‌‌లో జరిగే టిటిఎ మెగా కన్వెన్షన్‌ 2024ను విజయవంతం చేయాలన్నారు. అలాగే నిధుల సమీకరణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.  

సంస్థ ప్రెసిడెంట్‌ వంశీ రెడ్డి.. సమావేశానికి హాజరైన బోర్డు మరియు టిటిఎ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. సియాటెల్‌లో జరగనున్న టిటిఎ మెగా కన్వెన్షన్‌ అప్‌డేట్‌లను అందించారు. నిధుల సేకరణ, సాంస్కృతిక కార్యక్రమాలపై తన విజన్‌ను పంచుకున్నారు. సియాటెల్‌‌లో జరిగే  కన్వెన్షన్‌ను గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరారు.  

సంస్థ ప్రెసిడెంట్‌ ఎలక్ట్ నవీన్‌ మల్లిపెద్ది, EC సభ్యులు టిటిఎ మెగా కన్వెన్షన్‌ ఫండ్ రైజింగ్ కోసం తమ ప్రణాళికలను పంచుకున్నారు. టిటిఎ మెగా కన్వెన్షన్‌‌కు  సంబంధించి సూచనలను, సలహాలను, కార్యాచరణ ప్రణాళికలను అడ్వైజరీ చైర్‌ డాక్టర్‌ విజయపాల్‌ రెడ్డి తెలియజేశారు. ఫండ్ రైజింగ్ కార్యక్రమాలపై అన్ని టిటిఎ రాష్ట్ర చాప్టర్‌లు పనిచేయాలని కోరారు.  

అడ్వైజరీ కో-ఛైర్‌ మోహన్‌ పాటల్లోల, సభ్యులు భరత్‌ రెడ్డి మాదాడి తదితరులు కన్వెన్షన్‌తో పాటు ఇటీవల జరిగిన సేవా డేస్ విశేషాలను అందరితో పంచుకున్నారు. ఇకసెక్రటరీ కవితారెడ్డి 2023 కార్యక్రమాలపై నివేదికలను అందజేశారు.  బతుకమ్మను విజయవంతం చేసిన మహిళా నాయకులను ఈ సందర్భంగా ఆమె అభినందించారు.   

అనంతరం టీటీఏ మెగా కన్వెన్షన్ కి సంబంధించి అద్భుతమైన నిధుల సేకరణ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. కన్వెన్షన్ ఫండ్ రైజింగ్ ఈవెంట్‌కి విశేష స్పందన వచ్చింది. సమావేశాలకు అయ్యే  ఖర్చులను దాతలు విరాళాలుగా ప్రకటించారు. ఈ సందర్భంగా 4లక్షల డాలర్ల నిధులను సేకరించినట్లు నిర్వహకులు తెలిపారు. విరాళాలు ప్రకటించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు.

ఇక ఈ ఈవెంట్‌ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విందు, వినోద కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిభింభించేలా ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. యూత్ డాన్స్ ప్రదర్శన ఆడియన్స్‌లో జోష్ నింపింది. 

ఛార్లెట్‌లో నిర్వహించిన ఈ సమావేశం గ్రాండ్‌ సక్సెస్‌ అవ్వటం పట్ల నిర్వహకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశం గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ బోర్డ్‌ కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఈ కార్యక్రమానికి సహాయసహాకారాలు అందించి, మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ సంస్థ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మే 24 నుంచి 26 వరకు వాషింగ్టన్ లోని సియాటెల్‌లో జరిగే టీటీఏ మహాసభలకు తెలుగు వారందరూ పెద్ద సంఖ్యలో రావాలని  విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement