![UAE Agencies Offering Free Visa For Migrant Labourers - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/13/nrri.jpg.webp?itok=8dxSsgGB)
మోర్తాడ్ (బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని కొన్ని కంపెనీలు వలస కార్మికులకు తిరిగి స్వాగతం చెబుతున్నాయి. గతంలో వీసాల జారీ కోసం రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు చార్జీలు వసూలు చేసిన ఏజెన్సీలు ప్రస్తుతం ఉచిత రిక్రూటింగ్‌ను చేపట్టాయి. కరోనా కారణంగా కంపెనీలు భారీ సంఖ్యలో కార్మికులను ఇళ్లకు పంపించేయడంతో అనేక పోస్టులు ఖాళీ అయ్యాయి. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, కంపెనీల కార్యకలాపాలు ఊపందుకోవడంతో ఇప్పుడు వలస కార్మికుల సేవలు అత్యవసరం అయ్యాయి. దీంతో యూఏఈ పరిధిలోని దుబాయ్, అబుదాబి ఎయిర్‌పోర్టులలో క్లీనింగ్ పని కోసం పలు ఏజెన్సీలు కార్మికులను తరలిస్తున్నాయి.
నిజామాబాద్, జగిత్యాల్, ఆర్మూర్‌లలో ఒక ఏజెన్సీ కొన్ని రోజులుగా ఉచిత రిక్రూటింగ్‌ను కొనసాగిస్తోంది. కేవలం రూ.5 వేలను సర్వీస్ చార్జీలుగా వసూలు చేస్తూ ఉచిత వీసా, ఉచిత విమాన టికెట్‌లను ఇచ్చి యూఏఈ పంపిస్తోంది. గతంలో గల్ఫ్ దేశాలకు వలసలు మొదలైన ఐదు దశాబ్దాల కింద ఉచిత రిక్రూటింగ్ జరిగింది. ఇదిలాఉండగా ఇక్కడి వారికి ఉచిత నియామకాలపై అవగాహన లేకపోవడంతో మన ప్రాంతంలో కొనసాగుతున్న ఇంటర్వ్యూలకు పొరుగు రాష్ట్రాల కార్మికులు హాజరవుతుండటం విశేషం. ఇప్పటివరకు ఏపీ, కేరళ రాష్ట్రాలకు చెందిన దాదాపు 2వేల మందిని యూఏఈ తరలించినట్లు ఏజెన్సీ నిర్వాహకులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment