గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2021 డిసెంబర్ 9న సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలుచేయాలని ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల వ్యవసాయ, పారిశ్రామిక విధానాలు అమలుచేస్తోందన్నారు. డిమాండ్ల సాధనకోసం ట్రేడ్ యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈనెల 26వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ల వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ కలెక్టర్లకు నోటీసులు అందజేస్తామని వివరించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ప్రదర్శన ప్రారంభమవుతుందన్నారు. ఏపీ రైతు సంఘం కార్యదర్శి కేవీవీ ప్రసాద్ , సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు, రైతుసంఘం నాయకులు వై.కేశవరావు ఏఐటీయూసీ కార్యదర్శి ఓబులేశు, రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాధ్, కిసాన్ సభ రాష్ట్ర అధ్యక్షులు హరినాథ్, కిసాన్ కాంగ్రెస్ నాయకులు గోగినేని గుణశేఖర్, ఇఫ్టూ నాయకులు రామకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment