ముగిసిన తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ల
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్ల ఉత్సవాలు శనివారం పూర్ణాహుతితో ముగిశాయి. ముందుగా అమ్మవారి కల్యాణం పీటలపై కూర్చొన్న శ్రీగోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ అమ్మవారి వంశీకులు కొల్లా వెంకట చంద్రమౌళి, కాకాని వెంకట శ్రీనివాసరావు దంపతులతో కలశ పూజలు, పంచాహ్నిక కల్యాణాన్ని పురోహితులు, వేదపండితులు, అర్చకులు పాపమాంబ వంశీకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఐదు రోజుల కల్యాణ ఉత్సవం అనంతరం ఆలయ ఆవరణలో హోమం ఏర్పాటుచేసి శాంతి సంరక్షణకు పూర్ణాహుతి కార్యక్రమం జరిపించారు. అనంతరం హోమద్రవ్యాలను హోమగుండంలో వేసి తిరునాళ్లకు ముగింపు పలికారు. అనంతరం అమ్మవారి వంశీకులు, పాపమాంబ వంశీకులను నూతన వస్త్రాలతో సత్కరించారు. అర్చకులు, ఆలయ సిబ్బంది, వేదపండితులు, పురోహితులను అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కల్యాణం రోజున తిరుముడి సమర్పించి దీక్ష విరమించని స్వాములు పూర్ణాహుతి రోజు దీక్ష విరమించారు. తిరుముడిలోని ముద్దర(నెయ్యితో నింపిన) టెంకాయలను ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన హోమగుండంలో వదిలారు. పూర్ణాహుతిలో స్వాములతోపాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పాలు, పొంగళ్లతో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఈఓ బీహెచ్‌వీఎస్‌ఎన్ కిషోర్‌కుమార్, ఈఈ ఎల్.రమ, ఏఈవో తిరుమలేశ్వరరావు, ఏఈలు రాజు, అరవింద్, ప్రధానార్చకులు మర్రెబోయిన గోపిబాబు,ఆలయ సిబ్బంది, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment