ప్రమాదంలో పౌల్ట్రీ పరిశ్రమ | - | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో పౌల్ట్రీ పరిశ్రమ

Published Sun, Feb 16 2025 1:28 AM | Last Updated on Sun, Feb 16 2025 1:27 AM

ప్రమా

ప్రమాదంలో పౌల్ట్రీ పరిశ్రమ

అపోహలతో తీవ్ర నష్టం

బర్డ్‌ ప్లూ వచ్చేసిందని అపోహ ప్రజల్లోకి వెళ్లడంతో చికెన్‌ కొనేందుకు ముందుకు రావడంలేదు. నా కోళ్ల ఫారంలో 20 వేల కోళ్లు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నాయి. అమ్మకాలు తగ్గిపోవడంతో ఫారం వద్ద కేజీ రూ.80కి అడుగుతున్నారు. ఇదే తీరు కొనసాగితే తీవ్రంగా నష్టపోతాం.

– వంగా నాగరాజారెడ్డి, కోళ్ల ఫారం యజమాని, కోడూరు, జి.కొండూరు మండలం

రూ.35 లక్షలు నష్టపోయాను

నా కోళ్ల ఫారంలో అంతు చిక్కని వైరస్‌తో 15వేల కోళ్లు మృతి చెందాయి. వారం రోజుల్లో అమ్మకానికి వస్తాయనుకున్నాం. ఈ ఘటనతో రూ.35 లక్షలు నష్ట పోయాను. ఈ సమస్యను ఎలా అధిగమించాలో అర్థం కావడంలేదు.

– అత్తునూరి పద్మారెడ్డి, కోళ్ల ఫారం యజమాని, అనుముల్లంక, గంపలగూడెం మండలం

జి.కొండూరు: పౌల్ట్రీ పరిశ్రమను వైరస్‌ కోలుకోలేని దెబ్బతీసింది. బర్డ్‌ ఫ్లూ కలకలంతో ప్రమాదంలో పడింది. ఎన్టీఆర్‌ జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటంతో చికెన్‌ విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. బర్డ్‌ ప్లూ కలకలం, మరో వైపు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న అపోహలతో ఈ పరిశ్రమ భవిష్యత్‌ ప్రశ్నార్థకమైంది. మృత్యువాత పడిన కోళ్ల శాంపిల్స్‌ ఫలితాలు రాకపోవడంతో విక్రయాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. దీంతో కోళ్ల ఫారాల యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. వీరికి ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తేనే పరిశ్రమ నిలబడుతుందని, లేకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోయి మూతపడుతుందని యజమానులు ఆందోళన చెందుతున్నారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో

జిల్లాలో మొత్తం 116 కోళ్ల ఫారాలు ఉండగా వీటిలో 25 లేయర్‌ ఫారాలు, బ్రాయిలర్‌ ఫారాలు 83, నాటుకోళ్ల ఫారాలు 8 ఉన్నాయి. వీటిలో లేయర్‌ ఫారాల్లో 14,20,000 కోళ్లు ఉండగా బ్రాయిలర్‌ కోళ్లు 9,30,000, నాటు కోళ్లు 1800 నుంచి 2వేల వరకు ఉన్నాయి. బ్రాయిలర్‌ కోళ్ల ద్వారా జిల్లాలో సంవత్సరానికి 5,592 టన్నుల మాంసం ఉత్పత్తి జరుగుతుంది. లేయర్‌ ఫారాల ద్వారా ఏడాదికి 45.99 కోట్ల వరకు కోడి గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. జిల్లాలో ఏడాదికి మాంసం ఉత్పత్తిపై రూ.55.92 కోట్లు, కోడి గుడ్లపై రూ.206.95 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది.

వారానికి విక్రయాలు ఇలా

బర్డ్‌ ప్లూ కలకలంతో ఎన్టీఆర్‌ జిల్లాలో చికెన్‌ విక్రయాలు యాభై శాతానికి పైగా పడిపోయాయి. బర్ల్‌ ప్లూ రాకముందు వరకు జిల్లాలో వారానికి వెయ్యి టన్నుల వరకు మాంసం విక్రయాలు జరిగేవి. వైరస్‌ కలకలంతో గంపలగూడెం మండల పరిధి అనుమల్లంకలో15 వేల బ్రాయిలర్‌ కోళ్లు మృత్యువాత పడడంతో చికెన్‌ విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. విజయవాడజోన్‌ పరిధిలో శనివారం పేపరు రేటు ఫారం వద్ద లైవ్‌బర్డ్‌ కేజీ రూ.111, రిటైల్‌ లైవ్‌బర్డ్‌ కేజీ రూ.133, డ్రస్స్‌డ్‌ చికెన్‌ కేజీ రూ. 193, స్కిన్‌లెస్‌ కేజీ రూ.219గా నిర్ణయించినా.. ప్రజలు కొనడానికి ఆసక్తి చూపకపోవడంతో రూ.180 నుంచి రూ.200 వరకు కూడా విక్రయించారు. ఈ ప్రభావంతో కోళ్ల ఫారం వద్ద బ్రాయిలర్‌ కోళ్లు కేజీ రూ.75 నుంచి రూ.80 మాత్రమే ధర పలుకుతోందని ఫారం యజమానులు వాపోతున్నారు. కోడి మాంసం ఉత్పత్తికి తయారయ్యే సమయానికి కేజీకి అన్ని ఖర్చులు కలిపి రూ.100 వరకు అవుతున్న నేపథ్యంలో తక్కువ ధరకు విక్రయిస్తే తీవ్రంగా నష్టపోతామని చెబుతున్నారు. ఫారం వద్ద గుడ్డు ధర ప్రస్తుతం రూ.4.5 పలుకుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించకపోతే నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫలితాల ఆలస్యంతో మరింత నష్టం

గంపలగూడెం మండల పరిధి అనుముల్లంకలో నిర్వహిస్తున్న ఒకే కోళ్ల ఫారంలో ఈ నెల 9వ తేదీ నుంచి వరసగా నాలుగు రోజులపాటు 15వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. వాటి మృతికి కారణాలను తెలుసుకునేందుకు అధికారులు 12వ తేదీన కోళ్ల నుంచి శాంపిళ్లను సేకరించి భోపాల్‌లోని ల్యాబ్‌కి పంపారు. వీటి ఫలితాలు రాకపోవడంతో బర్డ్‌ ఫ్లూతో కోళ్లు మృతి చెంది ఉంటాయనే ఆందోళన ప్రజల్లో ఉంది.

కొనసాగుతున్న పర్యవేక్షణ

కోళ్ల మృత్యువాతతో పశు వైద్యశాఖ అప్రమత్తమైంది. ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలతో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. కోళ్ల ఫారాల నిర్వాహకులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అనుముల్లంక పరిసరాల్లో 10 కిలోమీటర్ల మేర రెడ్‌జోన్‌గా ప్రకటించి చికెన్‌ విక్రయాలను నిలిపివేశారు. జిల్లా పరిధిలో 12స్టేట్‌ బోర్డర్‌ చెక్‌పోస్టుల్లో 36మంది సిబ్బందితో మూడు షిఫ్ట్‌ల్లో బ్రాయిలర్‌ కోళ్ల రవాణాపై నిఘా పెట్టారు. శాంపిళ్ల ఫలితాలు వచ్చే వరకు తనిఖీలు కొనసాగుతాయని జిల్లా అధికారులు చెబుతున్నారు.

వేడిలో వైరస్‌ వ్యాపించే అవకాశం లేదు

ఆహార పదార్థాలు బాగా ఉడికించి తింటే ఎటువంటి వైరస్‌ వ్యాపించే అవకాశం లేదని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే చికెన్‌, గుడ్డు తిన్నవారైనా, తినే వారైనా పెద్దగా ఆందోళన చెందవద్దని చెబుతున్నారు. జిల్లాలో ఒక్క కోళ్ల ఫారం మినహా ఎక్కడా కూడా కోళ్ల మృతి చెందలేదని ప్రజలు భయాందోళనకు గురి కావద్దని, సోషల్‌ మీడియా పోస్టులు నమ్మొద్దని సూచిస్తున్నారు.

బర్డ్‌ ఫ్లూ కలకలం పడిపోయిన చికెన్‌ విక్రయాలు ఎన్టీఆర్‌ జిల్లాలో 15వేల కోళ్లు మృత్యువాత తీవ్రంగా నష్టపోతున్న పౌల్ట్రీ ఫారంల యజమానులు జిల్లాలో ఏడాదికి రూ.250 కోట్లకు పైగా వ్యాపారం

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రమాదంలో పౌల్ట్రీ పరిశ్రమ 1
1/2

ప్రమాదంలో పౌల్ట్రీ పరిశ్రమ

ప్రమాదంలో పౌల్ట్రీ పరిశ్రమ 2
2/2

ప్రమాదంలో పౌల్ట్రీ పరిశ్రమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement