కథలు వద్దు.. పని పూర్తి కావాలి
కంకిపాడు: ‘కథలు వద్దు. పని పూర్తి కావడం కావాలి. నేను చెప్పేది మీరు చెప్తే సమస్య పరిష్కారం ఎలా అవుతుంది’ అని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ పేర్కొన్నారు. మండలంలోని పునాదిపాడు, కంకిపాడు గ్రామాల్లో కలెక్టర్ సోమ వారం విస్తృతంగా పర్యటించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెత్త సేకరణ తీరు, సంపద కేంద్రాల నిర్వహణపై సమీక్ష చేశారు. వివిధ గ్రామాల్లో చెత్తసేకరణపై కలెక్టర్ ప్రశ్నించగా, మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు. దీంతో కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. కథలు వద్దు.. పనులు ఎంతవరకు జరిగాయో చెప్పాలన్నారు. తడి, పొడి చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, సంపద తయారీ కేంద్రాల కేంద్రాల నిర్వహణ సమర్థవంతంగా సాగాలని స్పష్టంచేశారు. అన్ని గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావాలని ఆదేశించారు. తడి, పొడి చెత్త వేరు చేసే ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని స్పష్టం చేశారు. వారంలో వంద కుటుంబాల్లో మార్పులు తీసుకురావాలని పేర్కొన్నారు. కంకిపాడు, పునాదిపాడు సంపద తయారీ కేంద్రాల నిర్వహణ బాగుందని, అన్ని కేంద్రాలు ఇదే రీతిగా పనిచేయా లని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రీ సర్వేపై సమీక్ష చేశారు. ఫ్రీ సర్వే రికార్డులను పరిశీలించి తగు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వి.భావనారాయణ, ఎంపీడీఓ పి.అనూష, మండల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి బాపూజీ పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
Comments
Please login to add a commentAdd a comment