బఫర్ జోన్‌లో చికెన్ షాపులు మూసేయాలి
● బర్డ్‌ఫ్లూ కారణంగానే అనుమల్లంకలో కోళ్ల మృతి ● నిరంతరం అప్రమత్తంగా ఉండాలి ● 35 గ్రామాల పరిధిలో కట్టుదిట్టమైన బయో సెక్యూరిటీ ● జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): చికెన్ దుకాణాలపై బర్డ్ ఫ్లూ ప్రభావం చూపుతోంది. గంపలగూడెం మండలంలోని అనుమల్లంక గ్రామంలో కోళ్ల మరణాలకు బర్డ్‌ఫ్లూ వ్యాధే కారణమని నిర్ధారణ కావడంతో ఆ గ్రామానికి పది కిలోమీటర్ల పరిధిలోని 35 గ్రామాల్లో తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలను కొనసాగించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. సమన్వయ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమల్లంక ఘటన నేపథ్యంలో చేపడుతున్న నివారణ, నియంత్రణ చర్యలపై సమీక్షించేందుకు కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. భోపాల్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (నిహ్షాద్) నుంచి ఈ నెల 14న వచ్చిన ఫలితాల్లో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్‌ఫ్లూయంజా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు పశు సంవర్థక శాఖ అధికారులు తెలిపారు. అప్పటికే యుద్ధప్రాతిపదికన భద్రతా చర్యలు తీసుకున్నట్లు వివ రించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన కేంద్రమైన అనుమల్లంకకు పది కిలోమీటర్ల పరిధిలో బఫర్ జోన్‌గా నిర్ణయించి, ఆ ప్రాంతంలో వ్యాధి నియంత్రణ చర్యలను పకడ్బందీగా కొనసాగించాని కలెక్టర్ ఆదేశించారు. బఫర్ జోన్‌లో చికెన్, గుడ్ల దుకాణాలను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మూసి ఉంచాలని స్పష్టం చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని, శానిటైజేషన్‌కు స్ప్రేయర్లు, ఫాగర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బందితో పాటు పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
జిల్లాలో పర్యవేక్షణ
జిల్లాలో ఉన్న 116 కోళ్లఫారాల్లోనూ నిరంతర పర్యవేక్షణతో పాటు బయో సెక్యూరిటీ చర్యలను చేపట్టాలని కలెక్టర్ లక్ష్మీశా పేర్కొన్నారు. బర్డ్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బఫర్ జోన్‌లో ఫీవర్ సర్వేలను నిర్వహించాలని, అవసరమైతే నమూనాలను పరీక్షించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతంలో పక్షుల్లో అసహజ మరణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని అటవీ అధికారులకు కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పశుసంవర్థక అధికారి డాక్టర్ ఎం.హనుమంతరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.సుహాసిని, డీపీఓ పి.లావణ్య కుమారి, ఫారెస్ట్ రేంజ్ అధికారి పి.రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment