ఆలపాటి గెలుపు
సాక్షిప్రతినిధి,గుంటూరు: కృష్ణా–గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. మొత్తం తొమ్మిది రౌండ్ల కౌంటింగ్ జరగగా మొత్తం పోలైన ఓట్లు 2,41,774కి గాను 2,14,865 ఓట్లు చెల్లబాటయ్యాయి. 26,909 ఓట్లు చెల్లలేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 1,45,057 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణ రావుకు 62,737 ఓట్లు వచ్చాయి. దీంతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 82,320 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఈ విజయం దక్కించుకున్నారు. మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో ఉండగా మిగిలిన వారెవరూ కనీస పోటీ ఇవ్వలేదు. మూడోస్థానంలో ఉన్న అన్నవరపు ఆనందకిషోర్‌కు 860 ఓట్లు దక్కగా గౌతుకట్ల అంకమ్మరావుకు అత్యల్పంగా 26 ఓట్లు దక్కాయి. మంగళవారం గుంటూరు కలెక్టర్ చాంబర్లో కృష్ణా, గుంటూరు పట్టభధ్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, గుంటూరు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు ధ్రువీకరణ పత్రం అందించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ మల్లేశ్వరి పాల్గొన్నారు.
దొంగఓట్లు, రిగ్గింగ్‌తో గెలిచారు
ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లు, బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్‌లతో అధికార పార్టీ గెలిచిందని పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. ఫలితాల వెల్లడి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలను రాజకీయం చేసిందని, తనపై ప్రత్యర్థులు దుష్ప్రచారం చేశారని, ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల మధ్య చీలిక తెచ్చారని, రూ.కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. అనేక చోట్ల ఎన్నికల రోజు, దొంగ ఓట్లు, అక్రమాలు చోటుచేసుకున్నాయని, దీనికి అధికార యంత్రాంగం కూడా సహకరించిందని ధ్వజమెత్తారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు అనేక సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగ యువత, రైతులు పలు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్ట్, అవుట్ – సోర్సింగ్, అనేక రంగాల్లో పనిచేస్తున్న చిరు ఉద్యోగులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిపై పోరాటాలను కొనసాగిస్తానని కేఎస్ లక్ష్మణరావు ప్రకటించారు.
40శాతం మంది తొలిసారి ఓటర్లు
ఎన్నికల్లో గెలుపొందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో 40 శాతం మంది తొలిసారి ఓటు హక్కును ఉపయోగించుకున్నారని చెప్పారు. తనపై వ్యతిరేక ప్రచారం చేసినా ఓటర్లు గెలిపించారని పేర్కొన్నారు. సమస్యలపై శాసనమండలిలో గళం విప్పుతానని వివరించారు.
మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే మ్యాజిక్ ఫిగర్ 82, 390 ఓట్ల మెజారిటీ... అనైతికంగా గెలిచారంటున్న పీడీఎఫ్ ప్రజలు కూటమికే పట్టం కట్టారన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment