ఉద్యమంలా ప్రకృతి వ్యవసాయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన ప్రకృతి వ్యవసాయం – ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికపై సమన్వయ సమావేశం గురువారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. రసాయన పురుగు మందులు, ఎరువులు మనిషి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. సాగులో సేంద్రియ ఎరువులు, జీవ ఉత్ప్రేరకాలు, కషాయాలు, ద్రావణాల వినియోగం వల్ల ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని సూచించారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌లోనూ రైతులకు సాయపడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహించాలని, శాసీ్త్రయ ఆధారాలతో అపోహలను తొలగించాలని కోరారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ప్రకృతి సాగు దిశగా నడిపించాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. ర్యాలీలు, పొలం సందర్శనలు, ప్రకృతి వ్యవసాయాన్ని విజయవంతంగా చేస్తున్న రైతులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ (జెడ్‌బీఎన్‌ఎఫ్) విధానాలు నేలసారం తగ్గకుండా పంటకు సత్తువనిస్తాయని, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని వివరించారు. ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులనూ తట్టుకునే సామర్థ్యం ఈ విధానాల పంటలకు ఉంటుందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చేయూతతో నిమ్మ, సపోటా, డ్రాగన్ ఫ్రూట్, ఆపిల్ బేర్, దానిమ్మ తదితర పండ్ల తోటలతో పాటు పూల తోటలు 19 రకాల ఉద్యాన పంటలను చేపట్టవచ్చని పేర్కొన్నారు. ఉద్యాన పంటల సాగుదిశగా నడిపించాలని సూచించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో వ్యవసాయ రంగ వృద్ధిని ఆరు శాతం నుంచి 15 శాతానికి తీసుకెళ్లేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రకృతి సాగుతో ముందుకెళ్తున్న రైతులు వెంకట గురుప్రసాద్ (నున్న), శ్రీనివాస్‌రెడ్డి (రెడ్డిగూడెం)ని కలెక్టర్ సత్కరించారు. జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, డ్వామా పీడీ ఎ.రాము, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కల్పన, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారి పి.ఎం.సుభాని, జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ కె.ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
ఖరీఫ్ కార్యాచరణ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment