27న ఇఫ్తార్ విందుకు పక్కా ఏర్పాట్లు
సమన్వయ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 27న ముస్లింలకు విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించే ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ ఇఫ్తార్ విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు హాజరవుతారన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం ఇఫ్తార్ విందు కార్యక్రమ సన్నద్ధతపై కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమం సజావుగా జరిగేందుకు అధికారులు ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేయాలని సూచించారు. విందుకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు తాగునీటికి, చేతులు శుభ్రం చేసుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, వక్ఫ్‌బోర్డు సీఈవో షేక్ మహ్మద్ అలీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ యాకుబ్ బాషా, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బాని, వక్ఫ్ ఇన్‌స్పెక్టర్ ఖాజా మస్తాన్, మైనార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment