టీడీపీ అధిష్టానానికి తిరువూరు ఎమ్మెల్యే అల్టిమేటం
48 గంటల్లో రాజీనామా చేస్తానన్న కొలికపూడి
తిరువూరు: తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, తెలుగుదేశం సీనియర్ నాయకుడు అలవాల రమేష్‌రెడ్డిపై 48 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే తన పదవికి రాజీ నామా చేస్తానని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గురువారం అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. ఇటీవల రమేష్‌రెడ్డి ఒక గిరిజన మహిళకు బ్యాంకు రుణం ఇప్పిస్తానని ఫోన్లో అసభ్యకర పదజాలం వాడారని, తన వెనుక విజయవాడ ఎంపీ చిన్ని ఉన్నారని ఆయన చెప్పుకొంటున్నారని కొలికపూడి తన నివాసం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. గిరిజన మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన రమేష్‌రెడ్డి తనకు ఎదురుపడితే గూబ పగలగొడతానని, ఆయనను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే టీడీపీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్న గ్రావెల్, మట్టి తరలింపు వ్యవహారంలో పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని, 97 లారీలను వదిలి మూడు లారీలను స్వాధీనం చేసుకోవడం వెనుక కారణాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే వేధిస్తున్నారు
అసత్య ఆరోపణలతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తనను వేధిస్తున్నా రని టీడీపీ సీనియర్ నేత అలవాల రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం రాత్రి ఎ.కొండూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను గిరిజన మహిళతో ఫోనులో అసభ్యంగా మాట్లాడినట్లు బోగస్ వీడియో సృష్టించి తనను వేధిస్తు న్నారని ఆరోపించారు. తనపై చర్యలు తీసుకోవాలని గిరిజన మహిళలు ఎమ్మెల్యేను కలిసి విజ్ఞప్తి చేశారని చెప్పడం కూడా అవాస్తవమన్నారు. ఎ.కొండూరుకు చెందిన గిరిజన మహిళలను రుణాలిప్పిస్తామని పిలిపించి వారితో ఫొటోలు దిగి అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో తాను పార్టీ కోసం కష్టించి పనిచేసి శ్రీనివాసరావును గెలిపించానని, ఇందుకు ఆయన ఇచ్చే గుర్తింపు ఇదా అని ప్రశ్నించారు. 30 ఏళ్లుగా ఎ.కొండూరు ప్రజలతో మమేకమైన తనపై అసత్యారోపణలు చేస్తున్న ఎమ్మెల్యే ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. పేదలు నివాసగృహాలు నిర్మించుకోడానికి అవసరమైన గ్రావెల్, మట్టి తోలకాలకు సైతం ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. తాను తప్పు చేస్తే అధిష్టానం తీసుకునే చర్యలకు బద్ధుడినని పేర్కొన్నారు.