బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే
బీఎస్పీ ఏపీ సమన్వయకర్త డాక్టర్ పూర్ణచంద్రరావు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర జనాభాలో 52 శాతంగా ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల పదవుల్లో 52 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మాజీ డీజీపీ, బీఎస్పీ ఏపీ సమన్వయకర్త డాక్టర్ పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు ముందు బీసీ కులగణన చేయాలని జాతీయ స్థాయిలో డిమాండ్ వచ్చిందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం సచివాలయాల సిబ్బందితో కులగణన చేయించిందన్నారు. బిహార్‌లో జనగణన చేసి బీసీ జనాభా 65 శాతం ఉన్నట్లు తేల్చారన్నారు. దాంతో ఆ రాష్ట్రంలో బీసీలకు 65 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారన్నారు. మన రాష్ట్రంలోనూ బిహార్ తరహాలో జనాభా ప్రాతిపదికన బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు కల్పించడం లేదని ప్రశ్నించారు. బీసీల్లో అనేక కులాలకు చట్టసభల్లో నేటికీ ప్రాతినిధ్యం లేకుండా పోయిందన్నారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు.. తమ ప్రభుత్వం వద్ద ఇప్పటికే సిద్ధంగా ఉన్న బీసీల లెక్కలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment