గుడులు, గోవులకూ రక్షణ కరువు
మధురానగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వంలో గుడులు, గోవులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. జీవీఆర్ నగర్ ట్రెండ్ సెట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న వినాయక ఆలయాన్ని వీఎంసీ అధికారులు కూల్చివేయటం దారుణమని మండిపడ్డారు. అధికారులు పొక్లయినర్లతో కూల్చివేసిన ఆలయాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఆలయాన్ని కూల్చివేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోసియేషన్ సభ్యులకు కనీస సమాచారం అందించకుండా.. అప్పటికప్పుడు రెండు పొక్లయినర్లతో కూల్చివేయటం ఏమిటని ప్రశ్నించారు. గత ఏడాది కాలంగా ట్రెండ్ సెట్‌లో ఆలయ నిర్మిస్తామని.. అభ్యంతరాలు ఉంటే ప్రాథమిక దశలోనే ఎందుకు నిలుపుదల చేయలేదని ప్రశ్నించారు. పైగా గర్భగుడిలోకి జేసీబీలను పంపించటం.. కూటమి ప్రభుత్వ అహంకారానికి అద్దం పడుతోందన్నారు. కౌన్సిల్ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తారని చెప్పారు.
కూల్చివేతల పరంపర..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక మధురానగర్ కాలువగట్టుపై 40 ఏళ్ల నాటి నాగేంద్రస్వామి పుట్టని తొలగించటంతో పాటు దుర్గాదేవి ఆలయం, రాజరాజేశ్వరి దేవి ఆలయం, శ్రీకృష్ణ మందిరం వద్ద ఏర్పాటు చేసిన గోశాలను కూడా దౌర్జన్యంగా కూల్చివేశారని మల్లాది విష్ణు గుర్తు చేశారు. గతంలోనూ హిందూ దేవాలయాలపై దాడులు, కూల్చివేతలు అత్యధికంగా జరిగినది టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అధికారాన్ని పంచుకున్న సమయంలోనేనని మల్లాది విష్ణు విమర్శించారు. కృష్ణా పుష్కరాల సమయంలోనూ నగరంలో 23 దేవాలయాలను కూల్చివేసిన చరిత్ర చంద్రబాబుదని.. జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వాటిని పునర్నిర్మించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి, నాయకులు మార్తి చంద్రమౌళి, సామంతకూరి దుర్గారావు, డి.దుర్గారావు, పవన్ రెడ్డి, నగరి ప్రసాద్, ఓంకార్ రెడ్డి, చైతన్య, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
వినాయక ఆలయం కూల్చివేత దారుణం వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
Comments
Please login to add a commentAdd a comment