
ఇసుక కొరత లేకుండా చర్యలు చేపట్టండి
కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ఇసుక కొరత లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కృష్ణా జిల్లా డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సెమీ మెకనైజ్డ్ విధానంలో యంత్రాలతో ఇసుక తవ్వకాల కోసం పర్యావరణ అనుమతులు పొందామన్నారు. పమిడిముక్కల మండలంలోని పడమటలంక, పెనమలూరు మండలంలోని చోడవరం, తోట్లవల్లూరు మండలంలోని నార్త్‌వల్లూరు, రొయ్యూరు వంటి నాలుగు కొత్త రీచ్‌లను ఎంపిక చేశామన్నారు. వీటన్నింటికి త్వరితగతిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఇసుక తవ్వకాలను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. సెమీ మెకనైజ్డ్ విధానం ద్వారా వినియోగదారులకు సమృద్ధిగా నాణ్యమైన ఇసుక లభించటంతో పాటు ధరలు తగ్గుతాయన్నారు. రానున్న వర్షాకాలంలో నిర్మాణ అవసరాలకు ఇసుక కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక స్టాక్ యార్డుల్లో సమృద్ధిగా నిల్వలు అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ సత్యనారాయణ, గనులశాఖ ఏడీ శ్రీనివాసరావు, అసిస్టెంట్ జియాలజిస్ట్ కొండారెడ్డి, కాలుష్యనియంత్రణ మండలి ఈఈ శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ నటరాజన్ తదితరులు పాల్గొన్నారు.