
లబ్ధిదారులకు ఎంతకష్టం!
● ఎంఎంసీ అధికారుల అనాలోచిత నిర్ణయంతో ఇబ్బందులు ● ఒకేసారి 3,900మందిని ఇంటర్వ్యూకు పిలవడంతో అదుపు తప్పిన పరిస్థితి ● కింద పడిపోయిన మహిళలు ● సొమ, మంగళవారాల్లో మరోసారి ఇంటర్వ్యూ
మచిలీపట్నంటౌన్: బలహీన వర్గాలకు చెందిన లబ్ధిదారులు అవస్థలు పడ్డారు. వివిధ స్వయం ఉపాధి యూనిట్ల కోసం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఇంటర్వ్యూకి వచ్చి.. అధికారుల అనాలోచిత చర్యల కారణంగా తిప్పలు పడి.. బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు. శుక్రవారం బందరు నగరపాలక సంస్థ కార్యాలయం(ఎంఎంసీ)లో ఇరుకుగా ఉండే మీటింగ్ హాల్లో నగరంలోని 50 డివిజన్‌ల నుంచి 3,900 మందిని ఒకేసారి ఇంటర్వ్యూకి పిలవడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో కొంత మంది మహిళలు కిందపడిపోయారు. నగరపాలక సంస్థ అధికారుల అనాలోచిత చర్యతో ఈ పరిస్థితి నెలకొనడంతో దరఖాస్తుదారులు అసహనం వ్యక్తం చేశారు. రుణాల కోసం వచ్చిన తమపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖం చాటేసిన బ్యాంకర్లు, వెల్ఫేర్ సెక్రటరీలు..
నగరపాలకసంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రుణ ఇంటర్వ్యూలకు కీలకమైన బ్యాంకర్లు ముఖం చాటేశారు. నగరంలోని దాదాపు 15 బ్యాంకర్లను నగరపాలక సంస్థ ఆహ్వానం పలుకగా కేవలం ఆరు బ్యాంకులకు సంబంధించిన సిబ్బందే హాజరయ్యారు. అలాగే ఆయా డివిజన్ సచివాలయాలకు చెందిన పలువురు వెల్ఫేర్ సెక్రటరీలు కూడా గైర్హాజరయ్యారు. దీంతో తమ సెక్రటరీలు కానరాక దరఖాస్తుదారులు ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి కీలక సమావేశాలు ఉంటే గత ప్రభుత్వ హయాంలో 10 నుంచి 15 డివిజన్‌లకు ఒక చోట నిర్వహించేవారు. దీంతో తోపులాట లేకుండా సజావుగా కార్యక్రమం ముగిసేది. ప్రస్తుతం పాలకులు, అధికారులకు సరైన అవగాహన లేకపోవటంతో ఒకే రోజు ఒకే చోట ఇంటర్వ్యూ ఏర్పాటు చేసి దరఖాస్తుదారుల ఇబ్బందులకు కారణమయ్యారు.
ఇంటర్వ్యూ వాయిదా..
శుక్రవారం నిర్వహించిన ఈ ఇంటర్వ్యూను తిరిగి ఈ నెల 7, 8 తేదీల్లో నిర్వహించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. స్థానిక టౌన్ హాల్‌ల్లో ఈ ఇంటర్వ్యూలు ఉంటాయని చెబుతున్నారు.
ఇంటర్వ్యూలకు హాజరైన దరఖాస్తుదారులతో కిక్కిరిసిన ఎంఎంసీ కార్యాలయం
ఇబ్బందులు పడ్డాం..
నగరపాలకసంస్థ అధికారుల అనాలోచిత చర్యలతో మేము ఇబ్బంది పడ్డాం. ఇరుకు గదిలో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసి నగరంలోని 50 డివిజన్‌ల నుంచి బీసీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న 3,900 మంది ఒకే సారి పిలవడం ఎంతవరకూ సమంజసం. పైగా వెల్ఫేర్ సెక్రటరీలు హాజరుకాలేదు. వారు వచ్చి ఉంటే మా దరఖాస్తులు పరిశీలించి ఒక క్రమ పద్ధతితో ఇంటర్వ్యూలకు పంపేవారు.
– లక్ష్మి, దరఖాస్తుదారు