
‘మణి’ మాస్టారు ఇకలేరు
చల్లపల్లి(అవనిగడ్డ): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, రిటైర్డు ప్రధానోపాధ్యాయుడు కొక్కిలిగడ్డ మణిప్రభాకరరావు(75) మాస్టారు గుండె పోటుతో ఆదివారం మృతి చెందారు. తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ మణిప్రభాకరరావు ఉపాధ్యాయ వృత్తిలో విశేష సేవలందించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. అవివాహితుడైన మణిమాస్టార్ సమాజ సేవకే అంకితమయ్యారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చల్లపల్లిలో లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసిన నాటినుంచి తన సేవలు అందిస్తూ ప్రస్తుతం చార్టర్ సభ్యులుగా కొనసాగుతున్నారు. మణి ప్రభాకరావు మాస్టారు భౌతికకాయాన్ని ఆదివారం సాయంత్రం స్వగ్రామమైన వక్కలగడ్డకు తీసుకురాగా పలువురు సందర్శించి ఆయనకు ఘన నివాళులర్పించారు. పలువురు నిరుపేద విద్యార్థులు, అనాథలకు తన ఇంటిలోనే ఆశ్రయం కల్పించి వారికి విద్యాబుద్ధులు నేర్పించిన మహోన్నత వ్యక్తి మణిప్రభాకరరావు మాస్టారు అని స్థానికులు కొనియాడారు.