
సందేశాత్మకం.. హాస్యభరితం
● సుందరయ్య కళానిలయం ఆధ్వర్యంలో జాతీయస్థాయి నాటికల ప్రదర్శన ● యడ్లపాడులో ఎంవీ చౌదరి వేదికపై ప్రదర్శనలు ● మూడోరోజు అలరించిన మూడు నాటికలు
యడ్లపాడు: స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 22వ జాతీయస్థాయి నాటికల పోటీలు కొనసాగుతున్నాయి. మూడో రోజు ఆదివారం మూడు సందేశాత్మక నాటికలు ఎంవీ కళావేదికపై ప్రదర్శితం అయ్యాయి. కళానిలయం అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు, అరుణకుమారి దంపతులు పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళానిలయం ప్రతినిధులు ముత్తవరపు రామారావు, పద్మారావు, నూతలపాటి కాళిదాసు, జరుగుల రామారావు, శంకరరావు తదితరులు పర్యవేక్షించారు.
ఆడపిల్లలకు సందేశం ‘నాన్న నేనొచ్చేస్తా’
పెళ్లంటే సర్దుబాటు.. సంసారం అంటే దిద్దుబాటు అనే విషయాన్ని మహిళలు తెలుసుకోవాలనే సందేశాన్ని గుంటూరు అమృతలహరి థియేటర్ ఆర్ట్స్ వారు ప్రదర్శించిన నాన్న నేనొచ్చేస్తా నాటిక ద్వారా ఇచ్చారు. ప్రతి తల్లితండ్రి మనసులో ఉండే పరమశక్తి ప్రేమ. పిల్లలు ఎదగాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, తాము పొందలేనిది వారికి ఇవ్వాలన్న తపన తల్లిదండ్రుల్లో ఉండటం సహజం. కానీ వివాహం తర్వాత వచ్చిన సమస్యల్లో, తల్లిదండ్రుల అభిమానం వల్ల ఆడపిల్లలకు సహనశక్తి తక్కువైపోతుంది. బాధ్యతను విడిచిపెట్టి, భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది వ్యక్తిగత వైఫల్యం మాత్రమే కాదు, సమాజంలో వేళ్లూనుకున్న ‘అత్యధిక అనురాగం’ అనే కొత్త వ్యాధికి నిదర్శనమని ప్రదర్శన ద్వారా హెచ్చరిక చేశారు. తాకబత్తుల వెంకటేశ్వరరావు రచన చేయగా, అమృత లహరి దర్శకత్వం వహించారు.
అందరిలోనూ కనిపించే మంచితనం ‘బ్రహ్మస్వరూపం’
స్వచ్ఛమైన దృష్టితో చూస్తే ప్రతి వ్యక్తిలోనూ మంచితనం కనిపించి ప్రపంచం మమకారాల నిలయంగా అనిపిస్తోందనే విజయవాడ మైత్రి కళానిలయం వారు తమ కళారూపం ద్వారా చూపే ప్రయత్నం చేశారు. శాంతియుత జీవితంలోకి ఊహించని కష్టాలు వస్తే, ప్రతికూల శక్తుల రూపంలో విధి విఘాతం కలిగిస్తే, నిరాశ నిస్పృహాలతో ఉన్న ఆ క్షణాన ధర్మస్థాపనకై సాక్షాత్తూ బ్రహ్మస్వరూపం ప్రత్యక్షమై, తుదితీర్పును ప్రసాదిస్తాడని సందేశాన్నిచ్చే కథాంశమే ఈ నాటిక. శ్రీ స్నిగ్ధ రచించగా, టీవీ పురుషోత్తం దర్శకత్వం వహించారు.
హాస్యభరితం ‘బావా ఎప్పుడు వచ్చితివి’
కుటుంబ సంబంధాలు మరింత బలపడాలంటే అమ్మ, నాన్న, అక్క, బావ వంటి ప్రేమతో నిండిన పిలుపులే రుజువులు. అవి అనురాగాలకు మూలస్తంభాలుగా నిలుస్తాయి. వీటిని హృద్యంగా, హాస్యరసంతో హత్తుకునేలా వినోదాన్ని అందించిన యడ్లపాడు మానవతా సంస్థ నాటిక ‘బావా ఎప్పుడు వచ్చితివి’. ఈ నాటికలో కుటుంబ పిలుపులు అర్థభేదాలకూ, అపోహలకూ దారితీయగలవని, కొన్నిసార్లు మహిళల మనోభావాల్ని గాయపరచగలవని, భర్తకు అవమానం గానీ, అనుమానం గానీ కలిగించగలవని ఆద్యంతం హాస్యాన్ని మేళవించి కడుపుబ్బ నవ్వించారు. స్వర్గీయ పీవీ భవానీప్రసాద్ రచించగా, సినీదర్శకుడు జరుగుల రామారావు దర్శకత్వం వహించిన ఈ నాటికలో యడ్లపాడుకు చెందిన కళాకారులు ప్రదర్శించిన ప్రత్యేక ప్రదర్శన ఆహుతుల్ని ఎంతో ఆకట్టుకుంది.