
స్వార్థ ప్రయోజనాల కోసమే అసత్య ఆరోపణలు
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): దురుద్దేశం, స్వార్థ ప్రయోజనాల కోసమే చైర్మన్, పాలకవర్గ డైరెక్టర్లు, సమితి ఉద్యోగులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కృష్ణా మిల్క్ యూనియన్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వరబాబు పేర్కొన్నారు. పాలప్రాజెక్టు ఆవరణలోని బోర్డు మీటింగ్ హాల్‌లో ఎండీ ఈశ్వరబాబు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. రెండు రోజుల నుంచి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్, డైరెక్టర్లు, ఉద్యోగులపై సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న అసత్య ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ పాడి రైతుల సంక్షేమం కోసమే కాకుండా వినియోగదారుడికి నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తోందన్నారు. అదే సమయంలో సమితిలో పని చేసే ఉద్యోగుల భద్రతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. మహిళా ఉద్యోగుల భద్రత కోసం ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేశామన్నారు. ఈ సెల్‌లో సమితిలో పని చేసే వివిధ హోదాల్లో మహిళలు సభ్యులుగా ఉన్నారన్నారు. అసలు నిందారోపణలు చేస్తున్న కొడాలి ప్రమీల అనే మహిళ కృష్ణా మిల్క్ యూనియన్ ఉద్యోగినే కాదన్నారు. ఆమె సమితిలో 2022లో పని చేశారని చెబుతుండగా, ప్రమీల వివరాలు తమ రికార్డుల్లో ఎక్కడా లేవన్నారు. సమితి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలను కృష్ణా మిల్క్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. అసత్య ప్రచారాలపై డీజీపీతో పాటు సిటీ పోలీస్ కమిషనర్‌ను సైతం కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. త్వరలోనే ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నారనే దానిపై నిజానిజాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఇంటి తాళాలు పగలగొట్టి రూ.5 లక్షల బంగారం చోరీ
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని రూ.5 లక్షల విలువైన బంగారు నగలను చోరీ చేసిన ఘటనపై కొత్తపేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పి.నైనవరం గాంధీ
బొమ్మ సెంటర్‌లో సూరగాని ప్రసాద్, శివకుమారిలు నివాసం ఉంటున్నారు. ఆటో నడుపుకుని జీవనం సాగించే ప్రసాద్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రామకృష్ణ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. రామకృష్ణకు ఈ నెల 18వ తేదీన వివాహం జరిపించేందుకు ముహూర్తం నిశ్చయమైంది. పెళ్లి కార్డులు పంచేందుకు ప్రసాద్, శివకుమారిలు సోమవారం మధ్యాహ్నం పెదకాకానికి వెళ్లారు. రాత్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి వెనుక తలుపులు తెరిచి ఉండటంతో లోపలకు వెళ్లి బీరువా తెరిచి కనిపించింది. అలమరలో బట్టల కింద పెట్టిన తాళాలతో బీరువా తెరిచినట్లు గుర్తించారు. బీరువాలో ఉండాల్సిన 73 గ్రాముల బంగారపు వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుల వేలిముద్రలను సేకరించారు. బీరువాలోని మూడు కాసుల బంగారపు నానుతాడు, 5 గ్రాముల బంగారపు సూత్రాలు, 4 గ్రాముల బంగారపు రూపు, 22 గ్రాముల బంగారపు చైను, రెండు కాసుల బంగారపు గొలుసు, 2 గ్రాముల బంగారపు లాకెట్ చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇంటి గురించి పూర్తిగా తెలిసిన వారే చోరీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

స్వార్థ ప్రయోజనాల కోసమే అసత్య ఆరోపణలు