
మునిసిపల్ సేవలు@ పురమిత్ర
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని మూడు సర్కిళ్ల పరిధిలోని ఆయా డివిజన్లలో ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను చెల్లింపులకు 5% రాయితీని పురమిత్ర యాప్ ద్వారా కూడా పొందవచ్చని వీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పురమిత్ర యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని, ఇందులో ప్రజలు వారి వారి సమస్యలను వెంటనే అధికారులకు తెలియజేసే అవకాశం కూడా ఉందన్నారు. ఈ యాప్‌ని తమ ఫోన్ నంబర్ ద్వారా లాగిన్ అయి తమకు విజయవాడ నగరపాలక సంబంధిత ఎలాంటి సమస్యనైనా వెంటనే ఫొటో తీసి అప్లోడ్ చేసిన వెంటనే దగ్గరలోని సంబంధిత సచివాలయం సిబ్బంది ఆ సమస్యను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. పురమిత్ర యాప్‌లో ప్రజల ఫిర్యాదులు, సేవలు, చెల్లింపులకు అవకాశం కల్పించిందన్నారు.
● పారిశుద్ధ్యం, నీటి సరఫరా, పట్టణ ప్రణాళిక సంబంధిత, వీధి దీపాలు, ఇంజినీరింగ్, తదితర అంశాలపై ఫిర్యాదులు తెలుపవచ్చని తెలిపారు.
● సేవల విభాగంలో ప్రజలు ఆన్‌లైన్ సేవలను పొందవచ్చని, ఖాళీ స్థలాలపై పన్ను విధించడం, నీటి చార్జీలు, ట్రేడ్ లైసెన్స్, ప్రకటనల పన్ను, డ్రెయినేజీ కనెక్షన్ తదితర అంశాలున్నాయని అన్నారు.
● చెల్లింపుల విభాగంలో ప్రజలు పురమిత్ర యాప్ ద్వారా ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, నీటి చార్జీలు, ప్రకటనల పన్ను, ఆస్తి పన్నుల్లో పేరు మార్పు మ్యుటేషన్ చార్జెస్, తదితర అంశాలపై ప్రజలకు సేవలు అందుబాటులో ఉన్నాయని ఇన్‌చార్జ్ కమిషనర్ తెలిపారు.
● అలాగే ఇంటి వద్దే చెత్త సేకరణ, పరిసరాలలో పారిశుద్ధ్య వంటి అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాన్ని కూడా తెలియపరిచే అవకాశాన్ని ఈ యాప్‌లో కల్పించారని పేర్కొన్నారు.
ఫిర్యాదులు, సేవలు, పన్ను చెల్లింపులకు అవకాశం