
విజయవాడ మీదుగావేసవి ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): వేసవి సీజన్ లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. హుబ్లీ–కతిహార్(07325) ప్రత్యేక వారాంతపు రైలు ఈ నెల 9 నుంచి 30 వరకు ప్రతి బుధవారం, కతిహార్–హుబ్లీ రైలు (07326) ఈ నెల 12 నుంచి మే 3 వరకు ప్రతి శనివారం నడపనున్నామని పేర్కొన్నారు. అదే విధంగా బెంగళూరు–నారంగీ (06559) ఈ నెల 8 నుంచి 29 వరకు ప్రతి మంగళవారం, నారంగీ–బెంగళూరు (06560) ఈ నెల 12 నుంచి మే 3 వరకు ప్రతి శనివారం నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
కార్తికేయుని నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదానానికి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జి.వెంకట్, రాధ దంపతులు రూ.1,00,116 విరాళం సమర్పించారు. మంగళవారం ఉదయం వారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ డెప్యూటీ కమిషనర్‌కు చిన్నారులు లావణ్య, ప్రవీణ్ చౌదరి పేరున విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉత్సాహంగా.. ఉల్లాసంగా..
గుడ్లవల్లేరు: మండలంలోని అంగలూరు ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ(డైట్)లో 2023–25 ద్వితీయ సంవత్సరం డైట్ విద్యార్థులకు ప్రథమ సంవత్సర విద్యార్థులు మంగళవారం వీడ్కోలు సభ నిర్వహించారు. డైట్ విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఉత్సాహంగా, ఉల్లాసంగా సందడి చేశారు. విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలను ప్రథమ సంవత్సర విద్యార్థి అంజుమ్ కౌసర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, సీనియర్ అధ్యాపకులు వినయకుమార్, మోహినికుమారి, లెక్చరర్లు, ఆచార్యులు పాల్గొన్నారు.
11న ఉమ్మడి కృష్ణాజిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: ఉమ్మడి కృష్ణాజిల్లా అండ ర్–19 పురుషుల వన్డే, మల్టీ డే క్రికెట్ జట్టును ఈ నెల 11వ తేదీన మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఎంపిక చేస్తున్నట్లు కృష్ణాజిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి ఎం.రవీంద్రచౌదరి తెలిపారు. 2006 సెప్టెంబర్ ఒకటో తేదీ తరువాత జన్మించిన వారే ఈ పోటీలకు అర్హులన్నారు. క్రీడాకారులు ఆధార్, జనన ధ్రువీకరణ పత్రం జిరాక్స్, వైట్ డ్రస్, స్పోర్ట్స్ షూ, సొంత కిట్‌తో ఆ రోజు ఉదయం 7.30 గంటలకు రిపోర్ట్ చేయాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 93934 44279ను సంప్రదించాలని సూచించారు.

విజయవాడ మీదుగావేసవి ప్రత్యేక రైళ్లు