
వైఎస్సార్ పాదయాత్ర ఒక మరపురాని చరిత్ర
మధురానగర్(విజయవాడసెంట్రల్): దేశ రాజకీయాల్లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర ఒక సంచలనంగా మరపురాని చరిత్రను సృష్టించిందని వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మహానేత చేపట్టిన పాదయాత్ర 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రంలోని కరువు సంబంధిత సమస్యలను, రైతుల పట్ల అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ ఉదాసీనతను ఎత్తిచూపడానికి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 11 జిల్లాల్లో 1,500 కి.మీ. పాదయాత్ర చేపట్టారని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ తో తనకు ఉన్న అనుబంధాన్ని, తన జీవితంపై ఆయన చూపిన ప్రభావాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ జీవితం భావితర నాయకులకు ఒక పాఠ్యపుస్తకమన్నారు. అనారోగ్యంతో ఉన్నవారికి, ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణ వైద్యసేవలు అందించేందుకు 108 సేవలను ప్రారంభించి పేదల ప్రాణాలకు భరోసా కల్పించారని అన్నారు. క్యాన్సర్, గుండె జబ్బులు సహా 942 వ్యాధులకు చికిత్సలను ఆరోగ్యశ్రీ కింద చేర్చి ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందేలా చేశారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు