
జ్యోతిరావు పూలే చిరస్మరణీయుడు
భవానీపురం(విజయవాడపశ్చిమ): సమ సమాజం కోసం ఉద్యమించిన స్పూర్తి ప్రదాత, సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే చిరస్మరణీయుడని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కొనియాడారు. జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని శుక్రవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలోని ఆయన విగ్రహానికి వైఎస్సార్ సీపీ నేతలు పూలమాలలువేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి చదువు ఒక్కటే మార్గమని భావించిన మహనీయుడు పూలే అన్నారు.పూలే, అంబేడ్కర్‌ల ఆశయాలు, ఆలోచనలను చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విస్మరించిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను తుంగలో తొక్కి డైవర్షన్ పాలిటిక్స్‌ను నడిపిస్తోందని ఎద్దేవా చేశారు. ‘చెప్పాడంటే..చేస్తాడంతే’ అనేమాట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే వర్తిస్తుందని పేర్కొన్నారు.
సామాజిక న్యాయానికి నాందీ...
సామాజిక న్యాయానికి నాందీ పలికిన గొప్పవ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే కాగా, ఆయన స్పూర్తితో పాలన సాగించిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్ పేర్కొన్నారు.
పూలే ప్రేరణతో మాజీ సీఎం వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటించి అమలుచేశారని ఆయన గుర్తుచేశారు. విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పూలే ఆశయాలకనుగుణంగా వైఎస్ జగన్ పాలన సాగించారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేసిందన్నారు. పత్రికా స్వేచ్ఛకు చంద్రబాబు ప్రభుత్వం సంకెళ్లు వేసిందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు షేక్ ఆసిఫ్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజరెడ్డి, నాయకులు కాలే పుల్లారావు, బూదాల శ్రీను, పోలిమెట్ల శరత్, తోలేటి శ్రీకాంత్, జమల పూర్ణమ్మ, విద్యార్థి నాయకుడు రవిచంద్ర, కార్పొరేటర్లు యరడ్ల ఆంజనేయరెడ్డి, ఎండీ ఇర్ఫాన్, గుండె సుందరపాల్, దేరంగుల రమణ, జి.నవీన్, పిళ్లా సూరిబాబు, మజ్జి శ్రీను పాల్గొన్నారు.
పూలేకు నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతున్న దేవినేని అవినాష్, పక్కన అరుణకుమార్, విష్ణు తదితరులు