
నంది వాహనంపై ఆది దంపతులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):ఇంద్రకీలాద్రి పై నిర్వహిస్తున్న చైత్ర మాస బ్రహ్మోత్సవాలలో నాల్గో రోజైన శుక్రవారం శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు నంది వాహనంపై నగరోత్సవ సేవ జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహా మండపం దిగువన నంది వాహనాన్ని వివిధ వర్ణాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగా, శ్రీ గంగా పార్వతి (దుర్గ) సమేతంగా మల్లేశ్వర స్వామి వారు అధిష్టించారు. ఆది దంపతులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం నగరోత్సవ సేవను లాంఛనంగా ప్రారంభించారు. మహామండపం నుంచి ప్రారంభమైన నంది వాహన సేవ కనకదుర్గనగర్, రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, సామారంగం చౌక్ మీదగా ఆలయానికి చేరుకుంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, చిన్నారులు, మహిళల కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల నడుమ ఊరేగింపు కనుల పండువ గా సాగింది. నగరోత్సవ సేవలో ఆలయ ఏఈవో దుర్గారావు, ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

నంది వాహనంపై ఆది దంపతులు