
విద్వేషాలు సృష్టించాలని చూస్తున్న బీజేపీ
సమైక్యతా శంఖారావంలో వక్తలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): దేశంలో ఐక్యంగా ఉన్న ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని రాజ్యసభ సభ్యుడు, ఏఐసీసీ మైనార్టీ విభాగం చైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ ఘడి ఆరోపించారు. సొసైటీ ఫర్ కమ్యూనల్ హార్మనీ ఏపీ చాప్టర్ ఆధ్వర్యంలో విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఆదివారం సమైక్యతా శంఖారావం సభ జరిగింది. ఇమ్రాన్‌ప్రతాప్ మాట్లాడుతూ వక్ఫ్ బిల్లు ఆమోదించి పార్లమెంట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా చీకటి చట్టాన్ని చేశారని ఆరోపించారు. గతంలో నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం కలిగేలా పలు చట్టాలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. పార్ల మెంట్‌లో ఏకపక్షంగా ఆమోదించిన వక్ఫ్ బిల్లును తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్పొరేట్ మీడియాను తమ చేతిలో పెట్టుకుని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో వాస్తవాలను ప్రచారం చేస్తూ ముందు భాగాన ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజలను రెచ్చగొడుతున్న పవన్‌కల్యాణ్
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లా డుతూ.. కూటమి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతనం ధర్మం అంటూ రెచ్చగొట్టేలా ఉపన్యాసాలు చేస్తూ మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శించారు.
మతసామరస్యానికి కృషి
సొసైటీ ఫర్ కమ్యూనల్ హార్మనీ ఉపాధ్యక్షుడు కె.విజయరావు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో మత సామరస్యానికి తమ సంస్థ కృషి చేస్తోందన్నారు. న్యాయవాది దివాకర్ బాబు మాట్లాడుతూ.. ప్రపంచ యుద్ధంలో కంటే మతాల కారణంగా జరుగుతున్న ఘర్షణల్లో ఎక్కువ మంది మనుషులు మరణిస్తున్నారని చెప్పారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు సభకు అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు తులసీరెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు అజీజ్ పాషా, మైనారిటీ హక్కుల నాయకులు షఫీ అహ్మద్, అయూబ్ ఖాన్, సీపీఎం నేత బాబురావు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ, అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, మౌలానా అబుల్ కలామ్ అజాద్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. తొలుత ప్రజానాట్య మండలి కళాకారులు గీతాలు ఆలపించారు. హేరామ్ నుంచి జైశ్రీరామ్ వరకు అనే పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు.