
ఎయిమ్స్‌లో బైపాస్ సర్జరీలు ప్రారంభం
మంగళగిరి: ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) రోగులకు ఇక నుంచి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించనుంది. గుండె జబ్బుల రోగులకు బైపాస్ సర్జరీలతోపాటు ఐసీయూ విభాగం ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు కొన్ని జబ్బులకు ఓపీడీ సేవలు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉండేవి. అయితే ఇప్పుడు ఇన్‌పేషంట్ సేవలు, అత్యవసర విభాగం, ఐసీయూలను ప్రారంభించారు. తొలిసారిగా శనివారం ఓ రోగికి వైద్యులు బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు.
రోజుకు 3,500 మందికి సేవలు
2015లో శంకుస్థాపన చేసుకున్న ఎయిమ్స్ 2018లో వైద్య సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం 46 విభాగాలలో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తోంది. ఎయిమ్స్ ఆస్పత్రి భవనాలతోపాటు రెసిడెన్సియల్, మెడికల్, నర్సింగ్ కళాశాలల భవనాల నిర్మాణాలను పూర్తి చేసుకుంది. రోజుకు 3 వేల నుంచి 3,500 మంది రోగులకు సేవలందిస్తున్న ఎయిమ్స్ ఇప్పటివరకు 22,49,986 లక్షల మంది రోగులకు సేవలందించింది. 37,13,713 ల్యాబ్ పరీక్షలు నిర్వహించింది. ఈ నెలలో ఇప్పటి వరకు 38,212 మంది రోగులు ఓపీడీ సేవలందుకోగా మార్చి చివరి వరకు 4,39,933 మంది రోగులకు సేవలందించింది. 42,843 మంది ఇన్ పేషంట్ విభాగంలో చికిత్స పొందారు. ఎయిమ్స్‌కు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రోగులు తరలివస్తుండడం గమనార్హం.
విజయవంతంగా బైపాస్ సర్జరీ
తొలిసారిగా చేసిన బైపాస్ సర్జరీ విజయవంతం కావడం సంతోషంగా ఉంది. నేను డైరెక్టర్‌గా పదవి చేపట్టిన కొద్ది కాలంలోనే బైపాస్ సర్జరీ జరగడంతో పాటు ఐసీయూ ప్రారంభించి రోగులకు సేవలందిస్తున్నాము. ఇప్పుడు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇతర రాష్ట్రాల నుంచి రోగులు ఇక్కడకు వచ్చి చికిత్స పొందుతున్నారు. ఇకపై మరింత సమర్థంగా వైద్యసేవలు అందిస్తాం.
ప్రొఫెసర్ డాక్టర్ అహెంతమ్ శాంత సింగ్ ఎయిమ్స్ డైరెక్టర్

ఎయిమ్స్‌లో బైపాస్ సర్జరీలు ప్రారంభం