
సహకార రంగ బ్యాంకులు బలోపేతం చేయాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): సహకార రంగ బ్యాంకుల బలోపేతానికి, గ్రామీణ వ్యవసాయ రంగ ప్రయోజనాల కోసం రెండంచెల విధానం ప్రవేశపెట్టాలని, ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. గ్రామీణ వ్యవసాయ మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.2.5 లక్షల కోట్లు కేటాయించాలని, సహకార సూత్రాలను కచ్చితంగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీసీబీఈఏ) వజ్రోత్సవాలు జరిగాయి. సంఘం జెండాను సభా ప్రాంగణంలో వ్యవస్థాపక నాయకుడు చలసాని మాధవరావు ఆవిష్కరించారు. ఛాయాచిత్ర ప్రదర్శనను ఏఐబీఈఏ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.హెచ్.వెంకటాచలం ప్రారంభించారు.
బ్యాంకింగ్ రంగంలో
రాజకీయ జోక్యం పెరిగింది..
ఆహ్వాన సంఘం చైర్మన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. దేశంలో పాలక ప్రభుత్వాల నిరంకుశ విధానాలతో సంహకార రంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. సహకార రంగంలో రెండంచెల విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ, జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉన్న గ్రామీణ సహకార బ్యాంకులలో, షెడ్యూల్ బ్యాంకుల్లో రుణాల విధానం వేర్వేరుగా ఉందని, రెండంచెల విధానంతో అప్పుల మీద వడ్డీ రేటు మూడు శాతం మేర తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ రంగంలో రాజకీయ జోక్యం పెరిగిందన్నారు. సహకార రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పూర్వ అప్కాబ్ చైర్మన్ తొండెపు దశరథ జనార్దన్ మాట్లాడుతూ.. సహకార రంగాభివృద్ధికి, ఉద్యోగుల శ్రేయస్సుకు తాను కట్టుబడి ఉన్నానని, రెండంచెల విధానం అమలుకు కృషి చేస్తానన్నారు. సహకార బ్యాంకు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బి.ఎస్.రాంబాబు మాట్లాడుతూ.. ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుకు రక్షణ లేకుండా పోయిందని, కార్పొరేట్ ఎగవేత దారులు ఎక్కువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత సంఘం కార్యకలాపాల సావనీర్‌ను ఆవిష్కరించారు. అనంతరం 70 మంది సీనియర్ నాయకులను సత్కరించారు. కార్యక్రమంలో ఆప్కాబ్ పూర్వ అధ్యక్షులు విజయేంద్రరెడ్డి, మల్లెల ఝాన్సీరాణి, సంఘం ప్రధాన కార్యదర్శి కె.వి.ఎస్.రవికుమార్, ఉపాధ్యక్షుడు వి.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఏపీ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్
వజ్రోత్సవాల్లో వక్తలు
సంఘం కార్యకలాపాల సావనీర్ ఆవిష్కరణ