
రైతులను ఇబ్బంది పెడితే బ్లాక్‌లిస్టులో పెడతాం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెడతామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. నగరంలోని కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఆయన జిల్లాలోని రైస్ మిల్లర్లతో ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రైతుల నుంచి మిల్లర్లపై అనేక ఆరోపణలు వస్తున్నాయని, ఇప్పటికై నా పద్ధతి మార్చుకోవాలని లేదంటే చర్యలు తప్పవన్నారు. మిల్లర్ల విషయంలో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నప్పటికీ కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. తేమశాతం, నూకలు సాకు చూపి రైతులను ఇబ్బందులకు గురి చేయకూడదన్నారు. మిల్లర్లు పద్ధతి మార్చుకుని ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దళారీ వ్యవస్థను సహించేది లేదని అన్నారు. ధాన్యం అన్ లోడింగ్ విషయంలో కాలయాపన చేయయడం రైతును ఇబ్బంది పెట్టడమేనని, 24 గంటల్లో మార్పు రావాలన్నారు. పంట దిగుబడి విషయంలో రైతు సంతోషంగా ఉన్నాడని, కొనుగోలు జరిగిన 24 గంటల్లో నగదు రైతు ఖాతాలకు జమ అవుతున్నప్పటికీ, మిల్లర్ల విషయంలో రైతు అసంతృప్తిని అర్థం చేసుకుని పూర్తి సహకారం అందించాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ రబీలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి జరగటం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేసినా, దళారీ వ్యవస్థను ప్రోత్సహించినా సంబంధిత మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. సమావేశంలో ఆర్డీఓ కె.చైతన్య, పౌరసరఫరాల శాఖ డీఎం ఎం.శ్రీనివాస్, మిల్లర్లు పాల్గొన్నారు.
మిల్లర్లకు మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక