
ఉద్యోగుల్లో గ్రూపుల గోల..
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రతిష్ట మసకబారుతోంది. పరీక్షల నిర్వహణలో విఫలం అవడం, సిబ్బందిలో గ్రూపు రాజకీయాలు పెచ్చుమీరడంతో వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఓ కాంట్రాక్టు ఉద్యోగి వైద్య విద్యార్థులకు గంజాయి తీసుకువచ్చి విక్రయిస్తున్నాడంటూ అధికారులకు ఫిర్యాదులు సైతం రావడంలో ఒక్కసారిగా అంతా షాక్ తిన్నారు. ఇంత జరిగిన తర్వాత పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలకు అధికారులు చేస్తున్నా, పరువు బజారున పడిందంటూ వైద్య వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికై నా కఠిన నిబంధనలు విధించాలంటూ పలువురు వైద్యులు కోరుతున్నారు.
స్లిప్పులు రాస్తూ..
ఈ నెల 7 నుంచి 21 వరకూ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఇక్కడ నిమ్రా, ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులతో పాటు, సిద్ధార్థ విద్యార్థులు కూడా పరీక్షలు రాస్తున్నారు. అయితే విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చాయి. అంతేకాదు పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో యూనివర్సిటీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఒకసారి ముగ్గురు, మరోసారి ఇద్దరి నుంచి స్లిప్పులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున కాపీయింగ్ జరిగినట్లు చెబుతున్నారు. అందుకు వైద్య కళాశాలలో కొందరి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సమయం కంటే ముందుగానే పేపర్ డౌన్‌లోడ్ చేసినట్లు కూడా విమర్శలు వచ్చాయి.
విద్యార్థులకు గంజాయి..
వైద్య కళాశాల హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులకు ఒక కాంట్రాక్టు ఉద్యోగి గంజాయి విక్రయిస్తున్నాడంటూ అధికారులకు రాతపూర్వక ఫిర్యాదులు అందడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే విచారించి ఆ ఉద్యోగిని విధుల నుంచి తప్పించారు. గంజాయి విక్రయించారా లేదా అనేది ఇప్పటి వరకూ తేల్చలేదు. ఇదిలా ఉంటే, ఆ ఉద్యోగిని మరలా విధుల్లోకి తీసుకోవాలంటూ పలువురు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఆరోపణలు ఉన్న వ్యక్తిని ఎలా తీసుకుంటారని పలువురు ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ అంశం వివాదాస్పదంగా మారింది.
మసకబారుతున్న వైద్య కళాశాల ప్రతిష్ట
సిద్ధార్థ మెడికల్ కాలేజీలో వ్యవస్థ అస్తవ్యస్తం యథేచ్ఛగా విద్యార్థుల మాస్ కాపీయింగ్ విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నారంటూ ఆరోపణలు ఉద్యోగుల మధ్య గ్రూపుల గోల
ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో దశాబ్దాలుగా ఇక్కడే పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. వారంతా గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, తప్పుడు ఫిర్యాదులు ఇస్తూ కళాశాల పరువు తీస్తున్నారంటూ పలువురు మండిపడుతున్నారు. అంతేకాకుండా అవినీతి, అక్రమాల్లో సైతం వారి పాత్ర ఉంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవల వచ్చిన ఆరోపణలన్నీ దీర్ఘకాలంగా ఇక్కడే పనిచేస్తున్న వారిపైనే అంటున్నారు. అధికారులు ప్రక్షాళన చేయకుంటే రానున్న రోజుల్లో వైద్య కళాశాల పరువు మరింతగా బజారున పడే అవకాశం ఉందంటున్నారు. పరిస్థితి విషమించక ముందే చర్యలు తీసుకోవాలని పలువురు ఉద్యోగులు హితవు పలుకుతున్నారు.