
కృష్ణా వర్సిటీకి ఉన్నత విద్యా అవార్డు
రుద్రవరం (మచిలీపట్నం రూరల్): కృష్ణా వర్సిటీ ప్రతిష్టాత్మక ఇండియా ఉన్నత విద్యా అవార్డ్ సాధించిందని విశ్వవిద్యాలయం రెక్టార్ ఆచార్య ఎంవీ బసవేశ్వరరావు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనితీరు ఆధారంగా కృష్ణా వర్సిటీ మూడో స్థానంలో నిలిచిందన్నారు. ఎడ్యుకేషన్ వరల్డ్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యూఢిల్లీలోని హోటల్ గ్రాండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సభ్యుడు జతీన్ పరాంజపే చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు బసవేశ్వరరావు తెలిపారు. తొలుత శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం సాధిస్తున్న విజయాలు, పొందుతున్న ఫలితాలపై బసవేశ్వరరావు ప్రసంగించారు.
30న జాబ్‌మేళా
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యాన ఈ నెల 30న ఉయ్యూరులో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ఉయ్యూరులోని ఏజీ, ఎస్‌జీ సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా జరుగుతుందని పేర్కొన్నారు. పలు కంపెనీల్లో ఉద్యోగాలకు 10వ తరగతి నుంచి పీజీ చదివిన 18 నుంచి 30 సంవత్సరాల్లోపు యువత అర్హులని వివరించారు. ఎంపికై న వారికి ఆకర్షణీయ వేతనంతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగావకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 96187 13243, 88851 59008లో సంప్రదించాలని సూచించారు.