
ప్రధానమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖరబాబు
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులకు పునర్ శంకుస్థాపన చేసేందుకు మే రెండో తేదీన విచ్చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో కమిషనరేట్‌లో పోలీసు అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రధానితోపాటు వీవీఐపీలు, వీఐపీలు పాల్గొంటున్న దృష్ట్యా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రాంతాల్లో శాంతి భద్రతలు, ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తుకు కావల్సిన ఏర్పాట్లపై ఈ సమీక్షలో చర్చించారు. డీసీపీలు కె.జి.వి.సరిత, తిరుమలేశ్వరరెడ్డి, ఎ.బి.టి.ఎస్.ఉదయారాణి, కృష్ణమూర్తినాయుడు, ఎస్.వి.డి.ప్రసాద్, ఏడీసీపీలు జి.రామకృష్ణ, ఎ.వి.ఎల్.ప్రసన్నకుమార్, ఏం.రాజారావు, కె.కోటేశ్వరరావు, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.
పరిసరాల
పరిశుభ్రతతో ఆరోగ్యం
మచిలీపట్నంఅర్బన్: పరిసరాల పరిశుభ్రతే ప్రజారోగ్యానికి తొలిమెట్టని కృష్ణా జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్. శర్మిష్ట అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మురుగునీటి నిల్వలున్న ప్రాంతాల్లో దోమల లార్వా వృద్ధి చెందుతుందన్నారు. గతంతో పోలిస్తే మలేరియా కేసులు ఏటేటా తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొన్నారు. దోమ తెరలు వాడాలని, ఇంటి పరిసరాల్లో దోమల నియంత్రణ మందులు పిచికారీ చేయించాలన్నారు. పరిసరాల్లో కొబ్బరి బోండాలు, రోళ్లు, పాతటైర్లు వంటివి లేకుండా చూసుకోవాలని సూచించారు. జిల్లా మలేరియా అధికారి బి. రామారావు మాట్లాడుతూ గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు స్వచ్ఛత, వ్యక్తిగత రక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.
బంగారు తాపడం పనులకు రూ. 5 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయ బంగారు తాపడం పనులకు హైదరాబాద్‌కు చెందిన భక్తుడు శుక్రవారం రూ.5 లక్షల విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన టి. శ్రీనివాస్ సంపత్ శుక్రవారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశా రు. ఆలయ అధికారిని కలిసి రూ. 5 లక్షల విరాళాన్ని ఆలయ బంగారు తాపడం పనుల నిమిత్తం అందజేశారు. అనంతరం దాతకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
రిజిస్ట్రేషన్ సేవలు సులభతరం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రిజిస్ట్రేషన్ సేవలు సులభతరం చేయడంతోపాటు ప్రజల సమయం ఆదా చేసేందుకు రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తేచ్చినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ ఏ రవీంద్రనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యూర్ కోడ్ స్కాన్ చేసి సులభంగా స్లాట్ బుక్ చేసుకునే వీలు కల్పించామన్నారు. ఈ నెల 4నుంచే విజయవాడ రీజియన్‌లోని గాంధీనగర్, మచిలీపట్నం రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి తెచ్చామన్నారు. శనివారం నుంచి కృష్ణా జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్, ఎన్టీఆర్ జిల్లాలోని 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు ఉపయోగించుకొని సమయాన్ని ఆదా చేసుకోవాలని కోరారు.

ప్రధానమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు